వయోవృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తుంది... ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎమ్‌వీవీవై) పథకం. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పదవీ విరమణ తరువాతి జీవితాన్ని సంతోషంగా కొనసాగించవచ్చు. 10ఏళ్ల పాటు ఫించనుకు హామీ ఉంటుంది. పీఎమ్‌వీవీవైను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) నిర్వహిస్తుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం మార్చి 2023 వరకు పొడిగించారు.
పెట్టుబడులు ఎలా..
ఈ పథకాన్ని ఎల్ఐసీ మాత్రమే సీనియర్ సిటజన్లు(60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు) కోసం ఆఫర్ చేస్తుంది. అటువంటి వారు ఈ ఫథకంలో ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసి వెబ్‌సైట్ ద్వారాగానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చు.
పెన్షన్ చెల్లింపులు..
పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు ఖచ్చితమైన పెన్షన్‌ను ఇస్తుంది. ఈ పథకం డెత్‌బెనిఫిట్‌ని కూడా ఆఫర్ చేస్తుంది. పాలసీ కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి వుంటే… పాలసీ కొనుగోలు చేసిన 10ఏళ్లకు.. ఎంత ప్రీమియంకైతే కొన్నామో అది మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారుకు/పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు.
ప్రీమియం ఇలా …
ఒక్కసారికి ప్రీమియం చెల్లించి పాలసీలో చేరాల్సి ఉంటుంది. కనీసం రూ.1.5 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేయవచ్చు. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా చెల్లించాలి. పింఛను ఇస్తారిలా… పెట్టుబడిగా రూ.1.5లక్షల నుంచి రూ. 15లక్షల దాకా పెట్టాక, నెల నెలా వడ్డీతో పింఛను అందిస్తారు. పెట్టిన సొమ్ముకు తగినట్టు నెలవారీ చెల్లింపులు ఉంటాయి. వడ్డీ 7.4శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10వేల దాకా పింఛను వస్తుంది. నెల నెలా వద్దనుకుంటే మూడు మాసాలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్(ఈసీఎస్) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛను జమ అవుతుంది. ఆధార్ అనుసంధానిత చెల్లింపుల విధానం ద్వారా జమ.
పెన్షన్ తీసుకునే విధానం ఆధారంగా పెట్టుబడి పెట్టాల్సిన కనీస మొత్తం..
పెన్షన్ తీసుకునే విధానం ఆధారంగా పెట్టాల్సిన గరిష్ట పెట్టుబడి..
రుణ సదుపాయం..
పాలసీ కొనుగోలు చేసిన తర్వాత 3ఏళ్లకు రుణ సదుపాయాన్ని పొందొచ్చు. కొనుగోలు ధరలో గరిష్టంగా 75శాతం మేరకు రుణం ఇస్తారు.
స్వాధీనం చేయాలన్పిస్తే…
అత్యవసర వైద్య సహాయ సమయాల్లో పాలసీని స్వాధీనం చేసి 98శాతం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసేసుకోవచ్చు. అత్యవసన వైద్య సహాయం లేదా తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల డబ్బు కావాల్సి వచ్చి ఎక్కడా దొరకకపోతే ఈ పాలసీని స్వాధీనం చేయోచ్చు. సొంత వైద్య ఖర్చులతో పాటు జీవిత భాగస్వామి అనారోగ్య ఖర్చు అవసరాలకు పాలసీని స్వాధీనపర్చవచ్చు.
ఇతర ముఖ్యాంశాలు..
- ఈ పథకంలో చేరేవారి వయసు 60ఏళ్లు పూర్తి అయి ఉండాలి
- పథకం కాలావధి 10 ఏళ్లు
- పాలసీ కొనుగోలు చేసేందుకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోనవసరం లేదు.
- వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డు తప్పనిసరి.
- ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు పొందుపర్చాలి.
ఇదీ చూడండి: 'కరోనా నష్టాల్లో 80% ప్రైవేటు రంగానిదే'