కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. దేశ జీడీపీలో భారత రుణ నిష్పత్తి 74 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని అంతర్జాతీయ ఆర్థిక నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. 2019 చివరిలో స్థూల జాతీయోత్పత్తిలో రుణ నిష్పత్తి 74 శాతం ఉండగా.. 2020 చివరిలో ఇది 90 శాతానికి పెరిగిందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ పాలోమౌరో తెలిపారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ ఫలితంగా.. ఇది 80 శాతానికి పడిపోతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
భారత రుణ నిష్పత్తి శాతం ఎక్కువగా కనిపిస్తున్నా.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇది సంభవించిందని తెలిపారు పాలో. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
మూడు రెట్లు ఎక్కువ నష్టం కలిగేది
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అన్నారు ఐఎంఫ్ ఎండీ క్రిస్టైన్ జార్జీవియా. ప్రపంచ దేశాలు చేపడుతున్న వ్యాక్సిన్ పంపిణీ, ఆర్థిక విధానాల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. 'ఆర్థిక వ్యవస్థపై సంబంధిత దేశాలు చర్యలు తీసుకోకపోయుంటే గతేడాది మూడు రెట్లు ఎక్కువ క్షీణించేది' అని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని జార్జీవియా సూచించారు. గ్రీన్ ప్రాజెక్ట్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని పేర్కొన్నారు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద ప్రపంచ దేశాలకు 650 బిలియన్ డాలర్లను పంపిణీ చేసే విధంగా ప్రతిపాదన తీసుకురానున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి : సిరి: 2-3 క్రెడిట్ కార్డులు అవసరమా?