అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటం వల్లే.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టొచ్చని అన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఉత్పత్తి తగ్గటం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. చమురు ఉత్పత్తి సంస్థలు కూడా.. తక్కువ ఉత్పత్తితో ఎక్కువ లాభాలు గడించాలని చూస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమని చెప్పారు.
పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ మండలిని తాము చాలా కాలంగా కోరుతున్నట్లు తెలిపారు ప్రధాన్. దాని వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం మండలిదేనని స్పష్టం చేశారు.
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖపైనా ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. రాజస్థాన్, మహారాష్ట్రాలోనే గరిష్ఠంగా పన్నులు విధిస్తున్నట్లు గుర్తించాలని సోనియాకు సూచించారు.