ప్రపంచంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. స్టాక్ ఎక్ఛేంజీ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ సంస్థకు చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడిని గుర్తించినట్లు డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లలను ప్రత్యేకంగా ఉంచి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సైబర్ దాడి ఎవరు, ఎక్కడి నుంచి చేశారనే వివరాలను మాత్రం డాక్టర్ రెడ్డీస్ వెల్లడించలేదు. సంస్థ కార్యకలాపాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సంస్థ సీఐఓ ముఖేష్ రాథీ ప్రకటించారు. వచ్చే 24గంటల్లో కార్యకలాపాలు యథాస్థితికి వస్తాయనే అశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో డాక్టర్ రెడ్డీస్ కీలకంగా వ్యవహరిస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించడంతోపాటు వ్యాక్సిన్‌ను ఇక్కడ సరఫరా చేసేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ మధ్యే భారత నియంత్రణ సంస్థల నుంచి కూడా డాక్టర్ రెడ్డీస్ అనుమతి పొందింది. ఈ సమయంలో సంస్థ ఐటీ విభాగాలపై సైబర్ దాడి ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.