పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోటును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ నోటును ఉపసంహరించుకోనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశ్వంబర్ ప్రసాద్ నిషద్ రూ. 2వేల నోట్ల అంశాన్ని ప్రస్తావించారు. రూ. 2వేల నోట్లు తీసుకొచ్చిన తర్వాత దేశంలో నల్లధనం పెరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రూ. 2వేల నోట్ల స్థానంలో మళ్లీ రూ.1000 నోట్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు స్పందించిన అనురాగ్ ఠాకూర్.. రూ. 2వేల నోట్ల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. నల్లధనాన్ని అరికట్టడం.. నకిలీ కరెన్సీని నిర్మూలించడం.. ఉగ్రవాదులు, అతివాదుల ఆర్థిక మార్గాలకు అడ్డుకట్ట వేయడం.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు. చలామణిలో ఉన్న నగదు విలువ కూడా పెరిగిందన్నారు. ఇక పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ కూడా పట్టుబడిందని తెలిపారు.