ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఒక కొత్త వ్యవస్థను రూపొందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు అప్లికేషన్ ఫారమ్‌ను నింపకుండానే పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డును సులభంగా, తక్షణమే పొందే వీలు ఉంటుంది. ఈ సౌకర్యం ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 'పన్ను చెల్లింపుదారుల ఆధార్ ఆధారిత ధ్రువీకరణను కూడా ప్రవేశపెడుతున్నాం. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం, ఎటువంటి దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేకుండా, ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పాన్ కార్డును తక్షణమే కేటాయించే వ్యవస్థను త్వరలో ప్రారంభించున్నాం' అని తెలిపారు.
గత సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను దాఖలు కోసం పాన్‌కు బదులుగా ఆధార్ కార్డును సమర్పించే అవకాశం ఉంది. అయితే, మార్చి 31, 2020 లోపు మీ పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి.
ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఎన్ఎస్డీఎల్, యూటీఐ-ఐటీఎస్ఎల్ అనే రెండు ఏజెన్సీల ద్వారా పాన్ కార్డును జారీ చేస్తుంది. ఐటీఆర్ దాఖలు చేయడం, బ్యాంక్ ఖాతాను తెరవడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం వంటి వివిధ రకాల ప్రయోజనాల కోసం కచ్చితంగా మీరు పాన్ కార్డును కలిగి ఉండాలి.
ఇదీ చూడండి: పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌లో ముగ్గురికి!