దమానీ.. మూడేళ్ల కిందట మారుమోగిన పేరిది. డీమార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను నడిపే అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ ఆ సమయంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా దాని జోరు కొనసాగుతూనే ఉంది. ఎంతలా అంటే ఆ కంపెనీ అధినేత రాధాకిషన్ దమానీని భారత్‌లోనే అగ్రగామి-10 కుబేరుల్లో స్థానాన్ని పదిలం చేసేంత.
దూసుకుపోతోంది...
అవును.. డీమార్ట్ ఇపుడు సాధారణ కంపెనీ కాదు. సోమవారం నాటికి రూ1.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అది అధిగమించింది. అంతే కాదు.. నెస్లే, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి దిగ్గజ సంస్థలను తోసిరాజని దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 18వ స్థానాన్ని పొందింది.
చరిత్ర సృష్టించింది...
మార్చి 21, 2017న ఆ కంపెనీ నమోదైనపుడు కూడా చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ.39,988 కోట్ల మార్కెట్ విలువను కైవసం చేసుకుంది. అంతటితో అది ఆగలేదు. ఆ జోరును కొనసాగిస్తూనే వెళ్లింది. తాజాగా(ఫిబ్రవరి 5) సంస్థాగత మదుపుదార్ల కోసం షేర్ల విక్రయాన్ని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరింది. రూ.4000 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉంది.
రూ.లక్ష.. మూడేళ్లలో రూ.8 లక్షల దాకా
మార్చి 21, 2017న అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) షేరు ధర రూ.640.75గా ఉండగా.. ఫిబ్రవరి 10, 2020 నాటికి రూ.2484.15కు చేరింది. ఆ సమయంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉండినట్లయితే మూడేళ్లలో అది రూ.4 లక్షలదాకా అయ్యేది. అదే మదుపరికి పబ్లిక్ ఇష్యూలో అంటే ఒక్కో షేరు రూ.300 వద్ద లభించి ఉండి ఉన్నట్లయితే రూ.లక్ష కాస్తా రూ.8 లక్షల వరకు అయ్యేది. మరి ఒక మదుపరే ఆ మేర సంపద సంపాదిస్తే.. ఇక ఆ కంపెనీ అధిపతి ఎంత సంపాదించి ఉండాలి. కంపెనీ షేరు జోరుతో దమానీ నికర విలువ రూ.84,000 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ (రూ.76,000 కోట్లు), సునీల్ మిత్తల్ (రూ.67,000 కోట్లు)ల కంటే ఎక్కువ ఇది.
దిగ్గజ కంపెనీలను తోసిరాజని...
ప్రస్తుతం డీమార్ట్ మార్కెట్ విలువ విప్రో, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌ల కంటే పైన ఉండడం విశేషం. అవెన్యూ షేరు ధర మరీ ఎక్కువగా ఉందని విశ్లేషకులు, మదుపర్లు విమర్శిస్తున్నా.. ఇప్పటిదాకా షేరు పనితీరుపై ఆ ప్రభావం అయితే పడలేదు. మొత్తం 25 బ్రోకరేజీ సంస్థల్లో 11 సంస్థలు ‘కొనండి’ రేటింగ్ ఇవ్వగా.. తొమ్మిది మాత్రం ‘అమ్మండి’ రేటింగ్ ఇచ్చాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే బలమైన లాభదాయకత వల్ల ఆ షేరు ఆకర్షణీయంగా కనిపిస్తోందని బ్రోకర్లు అంటున్నారు.
ఇదీ చూడండి: ముందస్తు వ్యాధుల నిర్వచనం మార్పు