ప్రాణాంతక కరోనా వైరస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా మందు లేదు. వ్యాక్సిన్ కూడా లేదు. నాలుగు నెలల క్రితం చైనాలో విరుచుకుపడి, తదుపరి ప్రపంచమంతా విస్తరించింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ వ్యాధిని అదుపు చేసే ఔషధాన్ని, రాకుండా నివారించే వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఫార్మా- బయోటెక్ కంపెనీలు తమ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఔషధాన్ని ఆవిష్కరించే దిశగా పెద్దగా ప్రగతి కనిపించనప్పటికీ, వ్యాక్సిన్ తయారీ విషయంలో కొంతమేరకు ఆశలు చిగురిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌లోని కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ప్రాథమికంగా కొంత ప్రగతి సాధించాయి. ల్యాబ్‌లో సింథటిక్ వైరస్ తయారు చేసి, దాని ఆధారంగా క్లినికల్ పరీక్షలు చేపట్టాయి. కానీ విదేశాల్లో ఎక్కడో వ్యాక్సిన్ తయారై, అది మన దేశానికి రావడానికి ఎంతో సమయం పడుతుంది.
సరైన పరిష్కారం...
దీనికి బదులు దేశీయ ఫార్మా- బయోటెక్ కంపెనీలను కరోనా వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్ తయారు చేసే దిశగా ప్రోత్సహించడం సరైన పరిష్కారంగా ప్రభుత్వ- పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు ముందుకు వస్తే సత్వర అనుమతులు ఇవ్వటానికి సిద్ధమని పేర్కొంటూ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్గదర్శకాలు జారీ చేశారు.
మినహాయింపులకు సిద్ధం..
ఒక వ్యాధికి కొత్త మందు, లేదా వ్యాక్సిన్ తయారు చేశాక, దానిపై క్లినికల్ పరీక్షల నిర్వహణ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అనుమతుల కోసం అందించటం, అనుమతి సంపాదించటం వరకు ఎన్నో ఏళ్లు పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో క్లినికల్ పరీక్షల నిర్వహణకే ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సత్ఫలితాలు ఇచ్చే ఔషధాన్ని ఆవిష్కరించగలిగితే కొన్ని పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమని డీసీజీఐ స్పష్టం చేశారు. ఇంకా పలు సూచనలు చేశారు. దీని ప్రకారం
- ఏదైనా ఔషధ సంస్థ కరోనా వైరస్ ఔషధం- వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుంటే, తగిన మద్దతు కోసం నేరుగా డీసీజీఐని సంప్రదించవచ్చు.
- ఇప్పటికే ఉన్న ఏదైనా ఔషధాన్ని కరోనా వైరస్ వ్యాధికి చికిత్సలో పనిచేస్తుందని నిర్ధరించి, దానికి అనుమతి కోసం వచ్చే సంస్థలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
- క్లినికల్ పరీక్షల నిర్వహణ దరఖాస్తులకు, విదేశాల నుంచి కరోనా వైరస్ మందు లేదా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని, దేశీయంగా విక్రయించాలనుకునే సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. జంతు పరీక్షలు, మలి దశ క్లినికల్ పరీక్షలు, స్టెబిలిటీ అధ్యయనాలు... చేపట్టదలిస్తే, త్వరగా పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.
- బయో-అవైలబిలిటీ/ బయో ఈక్వలెన్స్ (బీఏ/ బీఈ) అధ్యయనాల కోసం లేదా క్లినికల్ పరీక్షల కోసం వ్యాక్సిన్ లేదా మందు దిగుమతి చేసుకోదలిస్తే 7 రోజుల్లో అనుమతి ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో దిగుమతి లైసెన్సు (ఫామ్-10) ను, ఫామ్-41 రిజిస్ట్రేషన్‌తో పనిలేకుండా ఇవ్వనున్నట్లు డీసీజీఐ కార్యాలయం స్పష్టం చేసింది.
ఇదేవిధంగా కోవిడ్-19ను గుర్తించే వైద్య పరీక్షల కిట్లు తయారు చేసే సంస్థలకు కూడా సత్వరం అనుమతులు ఇవ్వనున్నట్లు డీసీజీఐ తెలిపారు.
ప్రస్తుతం పుణె కిట్లే
ప్రస్తుతం మనదేశంలో కరోనా వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) అభివృద్ధి చేసిన కిట్లను వినియోగిస్తున్నారు. కానీ ఈ వైరస్ మరీ విస్తరించి, ఎక్కువ మందిని పరీక్షించాల్సిన అవసరం వస్తే, కిట్లకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల ఇతర సంస్థలు తయారు చేసే కిట్లకు కూడా అనుమతులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అందులో భాగంగా సత్వర అనుమతులు ఇచ్చేందుకు డీసీజీఐ సిద్ధపడుతోంది. కరోనా వైరస్‌ను గుర్తించడానికి వైద్య పరీక్షలను అధికం చేయాలని, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించాలని, దానివల్ల వ్యాధి తీవ్రత ఏమేరకు ఉందనేది తెలుస్తుందని ఇప్పటికే ప్రజారోగ్య విభాగ నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో ఇప్పటికి రోజుకు అయిదారు వేల మందికి పరీక్షలు నిర్వహించగలిగిన సామర్థ్యమే ఉంది. దీన్ని గణనీయంగా పెంచుకోవాలసి అసవరం ఉందని, అందుకు తగ్గట్లుగా కిట్లు తయారు చేసే సంస్థలకు అనుమతి ఇవ్వాలని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
ఇదీ చూడండి: 3 లేయర్ల మాస్క్ ధర రూ.16 మించొద్దు:కేంద్రం