ప్రపంచంలోని ఉత్తమ నగరాలు-2021 జాబితాలో భారతదేశ రాజధాని న్యూదిల్లీ 62వ స్థానం దక్కించుకుంది. భారత్ నుంచి ఈ ఒక్క నగరం మాత్రమే అందులో నిలవడం గమనార్హం. గత ఏడాది ఈ జాబితాలో దిల్లీ 81వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది అభివృద్ధి దిశగా అడుగులు వేసి 62కు చేరుకోవడం విశేషం.
డెస్టినేషన్ డెవలప్‌మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, డిజైన్, టూరిజం, డేటా, ట్రావెల్ రిపోర్ట్స్ తదితర విషయాల్లో ప్రత్యేకతలు కలిగిన వాంకోవర్‌కు చెందిన రెసోనాన్స్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయించింది. నగరం ఖ్యాతి, పరిస్థితులు, పోటీతత్వం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని ప్రతిభావంతులు, సందర్శకులు, వ్యాపారవేత్తల అభిప్రాయల ఆధారంగా ఈ ర్యాంకును ప్రకటించారు. ప్రపంచంలోని మొత్తం నగరాల్లో ఉత్తమంగా ఉన్న 100 సిటీలకు ర్యాంకులు ఇచ్చారు.
ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. 'దిల్లీ వాసులకు ఇది శుభవార్త. దీన్ని సాధించడం కోసం గత ఆరేళ్లుగా ఇక్కడి ప్రజలు ఎంతో శ్రమించారు. దిల్లీలో పరిస్థితులు అనుకూలంగా మారాయనే విషయాన్ని ప్రపంచం గుర్తించింది' అని పేర్కొన్నారు.
ప్రపంచంలోని ఉత్తమ నగరాలు-2021 (టాప్ టెన్)
- లండన్
- న్యూయార్క్
- ప్యారిస్
- మాస్కో
- టోక్యో
- దుబాయ్
- సింగపూర్
- బార్సిలోనా
- లాస్ ఏంజెల్స్
- మాడ్రిడ్