ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్-19 మహమ్మారిని అడ్డంపెట్టుకొని సైబర్ నేరస్థులు ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఫిబ్రవరి 2 నుంచి మే 2 వరకు భారత్‌లో 9 వేలకు పైగా రాన్సమ్‌వేర్, ఫిషింగ్ దాడులు జరిగాయని వెల్లడించింది.
'ఫిబ్రవరి 2 నుంచి మే 2 వరకు కరోనా వైరస్‌కు సంబంధించిన మొత్తం 9100 ఫైల్ ఎన్‌కౌంటర్లను చూశాం. కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకొనేలా కొవిడ్-19 పేరుతో యూఆర్‌ఎల్, మాల్‌వేర్, ఫిషింగ్ ఈమెయిల్, అటాచ్‌మెంట్లను మా టూల్స్ గుర్తించాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్, ఆస్ట్రేలియాలో ఈ దాడులు తక్కువే. భారత్‌లో పటిష్ఠ నియంత్రణ ఉంది. ప్రస్తుతం ఉద్యోగులంతా ఒత్తిడిలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇళ్లలో సరైన నెట్‌వర్క్ వ్యవస్థలు లేవు. ఈ సంక్షోభంలో మా ఉద్యోగులు, వినియోగదారులు, ఐటీ ప్రొఫెషనల్స్‌కు సాంకేతికత పరంగా మేం సాయం చేశామని నమ్ముతున్నాం. వేర్వేరు దాడులను మేం గమనించాం" -- అన్ జాన్సన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఉపాధ్యక్షురాలు
ఒక సంస్థలోని వేర్వేరు శాఖల్లో ఒకదాని తర్వాత మరొకదాంట్లో రాన్సమ్‌వేర్ దాడులు జరిగాయని జాన్సన్ వెల్లడించారు. సైబర్ నేరస్థులు ఒక శాఖలో డబ్బు చేసుకున్నాక మరో శాఖపై దాడులకు తెగబడుతున్నారని వివరించారు.
"ఈ లింక్‌ను క్లిక్‌చేస్తే కరోనా సరికొత్త వ్యాక్సిన్ అందుకొనే తొలి 1000 మందిలో మీరుంటారు" తరహా లింకులు పంపించారని పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేస్తుండటం, చెప్పేందుకు పక్కనే ఎవరూ లేకపోవడం, ఆ లింకులను మెయిల్ చేయడం వల్ల దాడులు తీవ్రమవుతున్నాయని వెల్లడించారు.
వైద్యారోగ్య సంస్థలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థల్లో దాడులు ఎక్కువగా ఉన్నాయని జాన్సన్ తెలిపారు. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు సరైన టూల్స్ అందించాలని, అవగాహన కల్పించాలని, నిరంతరం మాట్లాడుతుండాలని ఆమె సూచించారు.