ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కనబరుస్తున్నాయి. ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్.. తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ముడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని ఇటీవల ప్రకటించింది. ఈ వార్తలతో మార్కెట్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి.
డోజోన్స్ సూచీ దాదాపు 3 శాతం పెరగగా, ఎస్&పీ 500 సూచీ 1.17 శాతం లాభాలను నమోదు చేసింది. ప్రధాన మార్కెట్లలో నాస్డాక్ మాత్రమే 1.5 శాతం నష్టాలను నమోదు చేసింది.
'ఐరోపా దేశాల్లో రెండో దశ వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో వ్యాక్సిన్ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకటనతో కొత్త ఆశలు చిగురించాయి. ఫలితాంగా మార్కెట్లు ఈ స్థాయిలో సానుకూలంగా స్పందిస్తున్నాయి' అని ఇండియా రేటింగ్స్ ప్రధాన ఆర్థిక వేత్త సునీల్ సిన్హా అంటున్నారు.
ఫైజర్ ప్రకటనకు తోడు.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు చెబుతున్నారు.
ఇలాంటి సమయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడవుతుందని సునీల్ సిన్హా విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధార స్థితికి చేరితే.. కార్పొరేట్ల ఫలితాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవే కారణాలతో దేశీయ మార్కెట్లు కూడా సోమవారం సెషన్లో రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరాయి. ఆసియా మార్కెట్లూ లాభాలను నమోదు చేశాయి.