కరోనా ప్రభావం విమాన ప్రయాణికులపై పడింది. గతేడాది సగానికి సగం మంది ప్రయాణం చేయలేదు. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. సాధారణ పరిస్థితులకు మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) అధికారులు అంచనా.
కొవిడ్‌కు ముందు రోజూ ఆర్జీఐఏ నుంచి 500లకు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు రాకపోకలు సాగించాయి. రోజుకు 50 వేల మంది ప్రయాణం చేసేవారు. వ్యాపార, ఇతరాత్ర అవసరాలకు అత్యవసరంగా రాకపోకలు సాగించాల్సిన వారికి సమయం ఆదా అవుతుండడంతో..ఎక్కువగా విమాన ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికా, బ్రిటన్ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. పర్యాటకం, విద్య, ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య క్రమంగా అధికం అవుతోంది. 2019లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరగా అందులో 20శాతం అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
కరోనా సమయంలో..
గతేడాది మార్చి 25 నుంచి మే 25 వరకు విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న 1600 మంది విదేశీయులను వారి దేశాలకు, వివిధ దేశాల్లో చిక్కుకున్న దాదాపు 3000 మంది తెలుగు వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆర్జీఐ నుంచి రాకపోకలు సాగించే వారు 2019తో పోలిస్తే.... 2020లో సగానికి సగం తగ్గారు. గతేడాది మొత్తం 91.6లక్షల మంది ప్రయాణించగా.. అందులో 10 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉండగా.. మిగిలిన వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డొమెస్టిక్ ప్రయాణికులు. గతేడాది మార్చి 25న లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి డిసెంబరు చివర వరకు వివిధ దేశాలకు వెళ్లిన అంతర్జాతీయ ప్రయాణికులు లక్షా 52వేలు కాగా, బయట దేశాల నుంచి హైదరాబాద్ వచ్చినవారు 2.3 లక్షల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 25వేల నుంచి 30వేల మధ్య ప్రయాణం చేస్తున్నట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: యాసంగిలో పెరిగిన సాగు... గణాంకాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ