కరోనా నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునే విధంగా స్మార్ట్‌ఫోన్ సాంకేతితకను దిగ్గజ సంస్థలు.. యాపిల్-గూగుల్ విడుదల చేశాయి. ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ యాప్‌లను ఉపయోగించిన వ్యక్తుల్లో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. వారు తిరిగిన ప్రదేశాల్లోని ఇతర యూజర్లకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశాయి.
అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ స్థానంలో ఈ సాంకేతికతను తీసుకురాలేదని యాపిల్-గూగుల్ స్పష్టం చేశాయి. 'ఆటోమెటిక్ ఎక్స్పోజర్ నోటిఫికేషన్' వ్యవస్థ ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరిచి కొవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వెల్లడించాయి. వినియోగదారుల సమాచారానికి పటిష్ఠమైన ఎన్క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా రక్షణ కల్పించనున్నట్లు స్పష్టం చేశాయి.
"టెక్నాలజీని వినియోగదారులు ఆమోదించేలా చేయడమే విజయానికి ముఖ్య సూత్రం. ఈ అప్లికేషన్లను ఉపయోగించేలా యూజర్లను ప్రోత్సహించడానికి పటిష్ఠమైన గోప్యత నిబంధనలు చాలా అవసరం."
-యాపిల్-గూగుల్ సంయుక్త ప్రకటన
కొన్ని దేశాల ప్రభుత్వాలు సొంతంగా మొబైల్ అప్లికేషన్లను రూపొందించినా.. వాటిలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు యాపిల్-గూగుల్ తెలిపాయి. ఆ యాప్‌లలో ఎక్కువ శాతం మొబైల్ జీపీఎస్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే, గోప్యత నిబంధనలను పటిష్ఠం చేయడానికి జీపీఎస్ అనుసంధానం కాకుండా యాపిల్, గూగుల్ సంస్థలు కొత్త టూల్స్ ప్రవేశపెట్టాయి.
భిన్నాభిప్రాయాలు
జర్మనీ, అల్బేనియా వంటి దేశాలతో పాటు అమెరికాలోని దక్షిణ కరోలీనా, ఉత్తర డకోటా రాష్ట్రాల్లోని సంస్థలు యాపిల్-గూగుల్ సాంకేతికత వినియోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ గోప్యత ఆంక్షల వల్ల ప్రభుత్వాలకు కచ్చితమైన సమాచారం అందే అవకాశం లేదని మరికొన్ని దేశాలు చెబుతున్నాయి.