డిమాండ్ లేక సతమతమవుతున్న వాహన రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్నుల్లో కోత విధిస్తూ కీలక ప్రకటన చేశారు. ఫలితంగా వాహన, తయారీ రంగాలకు ఊతం లభించింది.
వాహన రంగానికి ఊరట
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వాహనరంగానికి ఊరటనిచ్చింది. ఫలితంగా కార్లు, బైక్లు సహా వాహనరంగ విక్రయాలు ఊపందుకున్నాయి.
ఐషర్ మోటార్స్, మారుతీ సుజూకీ, హీరో మోటోకార్ప్, జామ్నా ఆటో, అశోక్ లేలాండ్ షేర్లు లాభాల బాటపట్టాయి. మారుతీ సుజూకీ ధర రూ.5,938.30 నుంచి రూ.6,626కు చేరుకుంది. అంటే 11 శాతం పెరిగింది. గత ఏడేళ్లలో లేని లాభాలతో మారుతీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీఎస్ఈలో రూ.1.99 లక్షల కోట్లకు పెరిగింది.
ప్రభుత్వం అకస్మాత్తుగా ఉత్పత్తి రంగాలపై, పెట్టుబడుల ప్రాముఖ్యతపై దృష్టి పెట్టిందని, ఇది చాలా ముఖ్యమైన నిర్ణయమని మారుతీ సుజూకీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు.
కార్పొరేట్ పన్ను
ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. సర్ఛార్జ్, సెస్ అన్నీ కలిపి ఇది రూ.34.94 శాతం అవుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించింది. అంటే సర్ఛార్జ్, సెస్ కలిపి 25.01 శాతం అవుతుంది.
షరతులు వర్తిస్తాయి.
కార్పొరేటు పన్ను తగ్గింపు విషయంలో ఓ షరతు వర్తిస్తుంది. 22 శాతం రేటుతో పన్ను కట్టిన ఆయా కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు లభించవు. ఇవి కావాలంటే పాత పన్ను విధానంలో కార్పొరేట్ పన్నులు చెల్లించాల్సిందే.
ఇదీ చూడండి: ఇంధన బంధమే లక్ష్యంగా... మోదీ హ్యూస్టన్ సభ