Vijay Mallya contempt of court: కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శిక్ష విధించే విషయమై ఇప్పటికే చాలా కాలం ఎదురుచూశామని పేర్కొంది. ఏదో ఒకరోజు మాల్యా కోర్టు ధిక్కరణ కేసు ముగియాల్సిందేనని వ్యాఖ్యానించింది. 2022 జనవరి 18న దీనిపై తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో 2017లో మాల్యా దోషిగా తేలారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. ఇకపై ఏమాత్రం వేచి చూసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే ఈ విషయంలో అఫిడవిట్లు సమర్పించే అవకాశం మాల్యాకు ఉంటుందని తెలిపింది. ప్రత్యక్షంగా హాజరుకాకపోతే.. తన న్యాయవాది ద్వారా అయినా సమర్పించవచ్చని పేర్కొంది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తాను కోరింది ధర్మాసనం.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేశారు మాల్యా. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 2017లో మాల్యాను దోషిగా తేల్చింది. ఈ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఇదీ చదవండి: ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అగ్రాసనం భారతీయులదే- కారణమిదే..