కరోనా వ్యాప్తితో ఏ వస్తువు కొనాలన్నా కాస్తంత ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. వినియోగదారులు ఓ వస్తువును కొనేముందు.. అనేక రకాలుగా విశ్లేషించి తుది నిర్ణయానికి వస్తున్నట్టు డెలాయిట్ నివేదికలో తేలింది.
- కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భారతీయ వినియోగదార్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ఏవైనా ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు వాటి గురించి చురుగ్గా సమాచారాన్ని సేకరించడం సహా.. విపణిలో ఉన్న అలాంటి ఉత్పత్తుల్ని పోల్చి చూసి, ఆ తరవాతనే కొనుగోళ్ల నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపింది.
- ప్రస్తుతం విక్రయ కేంద్రాలు (టచ్ పాయింట్లు) లేకపోవడం వల్ల వాటి మూసివేతలను భర్తీ చేయడానికి, వినియోగదార్ల అవసరాల్ని తీర్చడానికి డిజిటల్ సాంకేతికత మరింత వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది.
- ఆధునిక వినియోగదార్లు పర్యావరణ హిత ఉత్పత్తులపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండటంతో పాటు ఎలాంటి బ్రాండ్లను వారు వినియోగిస్తున్నారో స్పృహ కలిగి ఉన్నారని, ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని నివేదిక తెలిపింది.
- దీని ఫలితంగా వినియోగదార్లు వారి ఉత్పత్తుల వినియోగం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని, కొనుగోళ్ల నిర్ణయాల్లోనూ ఇంకాస్త శ్రద్ధ వహించవచ్చని నివేదిక వివరించింది.
- సాంకేతిక పురోగతులు, పెరుగుతున్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమాచార మార్పిడిని సులభతరం చేశాయి. ఈ మార్పు వైవిధ్యమైన వినియోగదార్లను సామాజిక మాధ్యమాల్లో ఏకం చేయడానికి, అంతర్జాతీయ-స్థానిక పోకడల్ని వారు ఎంచుకోవడానికి ఉపయోగపడుతోందని నివేదిక తేల్చింది.
- 'కరోనా మహమ్మారి వినియోగదార్ల కొనుగోలు ప్రవర్తనా శైలిని మారుస్తూనే ఉంది. వారు డిజిటల్ వైపు ఎక్కువగా మళ్లేందుకు దోహదం చేస్తోంది. ఇదే సమయంలో ఆరోగ్యంపై మరింత సామాజిక స్పృహ కలిగి ఉండేలా కూడా చేసింద'ని డెలాయిట్ ఇండియా భాగస్వామి రజత్ వాహి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ప్రైవేటు బ్యాంకులు