విమానయాన వ్యాపారంలో డబ్బులు సంపాదించే వారు ఉండరు.. ఈ రంగ ఆర్థిక వ్యవహారాల్లో నరకమే ఎక్కువగా ఉంటుంది’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పూర్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.ఆర్.స్మిత్. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, కరోనా వైరస్ విస్తృతి తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయంగా విమానయాన సంస్థల తీరు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. 2002-033 నాటి సార్స్, 2007-08 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2011 నాటి అమెరికాపై ఉగ్రదాడి అనంతరం ఎదురైన పరిస్థితులకు మించి, ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. అంతర్జాతీయంగా విమానయాన సంస్థలన్నింటికీ కలిపి ఈ ఏడాది రూ.8.33 లక్షల కోట్ల (113 బిలియన్ డాలర్ల) నష్టం సంభవించవచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అంచనా వేస్తోంది. అమెరికాలో గతేడాది లాభాలు ఆర్జించిన సంస్థలు, ఈ ఏడాది కరోనా దెబ్బకు తమ అంచనాలు ఉపసంహరించుకున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యుత్తమంగా ఉన్న విమానయాన సంస్థ వద్ద కూడా నగదు నిల్వలు ఒక నెలకు మించి లేవని తెలుస్తోందని సెంటర్ ఫర్ ఆసియా-పసిఫిక్ ఛైర్మన్ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇండిగో కూడా జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది కూడా.
మన దేశంలో
పిల్లలకు సెలవలు ఉన్నప్పుడే, ఏ దేశంలో అయినా ప్రయాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దేశీయంగా చూసినా, మార్చిలో పరీక్షలు ముగిసినప్పటి నుంచి జూన్ వరకు విమానాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా, పర్యటక దేశాలు-బంధుమిత్రుల దగ్గరకు వెళ్లేందుకు అంతర్జాతీయ మార్గాల్లోనూ గిరాకీ అధికంగా ఉండేది. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా ఉండే విమాన ఇంధనం (ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్) ధర తగ్గడం విమానయాన సంస్థలకు సంతోషం కలిగిస్తోంది. అయితే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఫలితం లేకుండా పోయింది. ఐటీ సహా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం కూడా ‘తప్పనిసరి అయితేనే’ ప్రయాణించండి అంటూ చేస్తున్న సూచనల ప్రభావం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలపై నిషేధం విధిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, విమానయాన సంస్థలు బెంబేలు పడుతున్నాయి. చైనాకు రాకపోకలు సాంతం నిలిపేయగా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలకూ సర్వీసుల సంఖ్యను ఎయిరిండియా కూడా తగ్గించింది.
వీసా ఆంక్షల ప్రభావం
మన దేశం నుంచి విదేశాలకు పర్యటన, బంధుమిత్రుల వద్దకు వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చేందుకు ప్రస్తుత వీసా ఆంక్షల వల్ల ఇబ్బందేమీ ఉండదు. అదేవిధంగా వీసా ఉంటే అమెరికా వంటి దేశాలకు వెళ్లేందుకూ ఇబ్బంది ఉండదు. అయితే ప్రవాసీయులుగా విదేశాల్లో దీర్ఘకాలం ఉంటున్న వారికి, విదేశీయులు ఇక్కడి వచ్చేందుకు మాత్రం ఆంక్షలు ఎదురవుతాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.
స్లాట్‌లు కాపాడుకునేందుకు..
సాధారణ పరిస్థితుల్లో షెడ్యూల్ విమానాల్లో 80 శాతం సర్వీసులైనా నిర్వహించకపోతే, విమానాశ్రయాల్లో విమానయాన సంస్థలకు కేటాయించిన స్లాట్స్ రద్దయ్యే ప్రమాదముంది. ఇప్పుడు ప్రయాణికులు తక్కువగా ఉన్నారని, విమాన సర్వీసులు రద్దు చేస్తే, భవిష్యత్తులో కీలక స్లాట్స్ లభించవనే ఆందోళనతో సంస్థలు ఖాళీగా అయినా సర్వీసులు కొనసాగిస్తున్నాయి.
దేశీయంగా సంస్థలేం కోరుతున్నాయంటే..
జెట్ ఎయిర్‌వేస్ మూతబడటం, ఎయిరిండియాను కూడా ప్రైవేటీకరించేందుకు యత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, మరే విమానయాన సంస్థ కార్యకలాపాలు నిలిచిపోకుండా ప్రభుత్వం సహకరించాలనే విజ్ఞప్తులు పరిశ్రమ నుంచి వస్తున్నాయి. ఈ సంస్థల రుణాలు నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా మారితే, విమానయానంపై ఆధారపడిన 30-40 వ్యాపారాలకూ చేటు తప్పదని చెబుతున్నారు.
* దేశీయంగా పెద్ద, చిన్న తేడా లేకుండా విమానయాన సంస్థలన్నీ సర్వీసుల్లో కోత విధిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించే ఫీజులు, రూట్ నావిగేషన్‌కు చెల్లించే రుసుమును ప్రభుత్వం తరఫున రద్దు చేయాలని కోరుతున్నాయి. ఇంధన కంపెనీల నుంచి రుణంపై ఇంధనం సరఫరా చేయాలని అభ్యర్థిస్తున్నాయి.
* పైలట్లు ప్రతి 6 నెలలకు ఒకసారి లైసెన్స్ పునరుద్ధరణ కోసం సిమ్యులేటర్‌పై పరీక్షలకు హాజరవ్వాలి. మనదేశంలో విదేశీ పైలట్లు అధికంగా ఉంటున్నారు. వీరు ప్రస్తుతం విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ తిరిగివచ్చినా 14 రోజుల దాకా విధులకు దూరంగా ఉండాలి. అందువల్ల ఈ గడువును ప్రస్తుతానికి ఏడాదికి పొడిగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను కోరుతున్నారు.
* దేశీయంగా ప్రస్తుతం 500కు పైగా విమానాలు నడుస్తుండగా, రాబోయే 20 ఏళ్లలో 1900 విమానాలు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. ఒక్కో విమానానికి పైలట్-కోపైలట్ కలిపి, ఆరుగురు చొప్పున అవసరం. అందువల్ల దేశీయంగా పైలట్ శిక్షణ అవకాశాలను మరింత విస్తృతం చేయాలి. ఇక్కడి కంటే విదేశాల్లో సులభంగా పైలట్ శిక్షణ పొందే వీలుంటోందని, అక్కడనుంచి వచ్చే వారికి నెలకు రూ.10-15 లక్షల వేతనం చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. తగినంతమంది పైలట్ల లభ్యత లేనందునే, గిరాకీ ఆధారంగా అధికంగా ఇవ్వాల్సి వస్తోదని, దీనిపై తగిన నియంత్రణ ఉండాలనే భావనా పరిశ్రమలో వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి : మైక్రోసాఫ్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తప్పుకున్న బిల్‌గేట్స్