వాహన విక్రయాలు (Automobile sales in August) ఆగస్టులో మెరుగయ్యాయి. అయితే గిరాకీకి అనుగుణంగా విక్రయాలు జరపలేకపోయామని, ఇందుకు చిప్‌సెట్‌ల కొరతే (Chipset Shortage) కారణమని దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 2020 ఆగస్టుతో పోలిస్తే ఈసారి దాదాపు కార్ల కంపెనీలు అన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి.
టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో 53% వృద్ధి కనిపించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్, టయోటా, కియా ఇండియా, స్కోడా, నిస్సాన్ మోటార్ తదితర సంస్థల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి.
దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) (Maruti Suzuki Cars) అమ్మకాలు మాత్రం 5% పెరిగి 1,30,699కు చేరాయి. 2020 ఆగస్టులో సంస్థ 1,24,624 వాహనాలు విక్రయించింది. ఎంఎస్‌ఐ దేశీయ విక్రయాలు 1,16,704 నుంచి 6% తగ్గి 1,10,080కి పరిమితమయ్యాయి.
చిన్న కార్లలో ఆల్టో, ఎస్-ప్రెసోల విక్రయాలు 19,709 నుంచి 20,461కు చేరాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ టూర్‌ఎస్ విక్రయాలు 61,956 నుంచి 45,577కు తగ్గాయి. మధ్యస్థాయి సెడాన్ సియాజ్ అమ్మకాలు 1,223 నుంచి 2,146కు పెరిగాయి. వినియోగ వాహనాలైన ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్‌ఎల్6, జిప్సీ విక్రయాలు 21,030 నుంచి 24,337కు చేరాయి.
ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ 22%, హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 3% తగ్గితే, బజాజ్ ఆటో విక్రయాలు 5% పెరిగాయి. విద్యుత్తు ద్విచక్ర వాహనాల సంస్థ వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ విక్రయాలు 4 రెట్లు మించాయి. ఎస్కార్ట్స్ ట్రాక్టర్ల అమ్మకాలు 22% క్షీణించాయి.
ఇదీ చదవండి: కియా, ఎన్ఫీల్డ్ నుంచి కొత్త మోడల్స్.. ధరలు ఇలా...