5జీ నెట్‌వర్క్‌ను ఓ ఆయుధంగా ఉపయోగించుకుని చైనా కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ఆ దేశ మిలిటరీ విభాగం.. భారతీయులపై దాడికి పాల్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతికతలను చైనా నిఘా సాధనాలుగా ఉపయోగించుకుంటోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు నిపుణులు. టెలికాం రంగంలో స్వదేశీ పరిజ్ఞానం, ఉత్పాదకత సామర్థ్యాల అభివృద్ధికి ప్రేరణనిచ్చేలా ప్రణాళికలు రచించాలని సిఫార్సు చేస్తున్నారు. చైనా వస్తువులపై ఆధారపడటం తగ్గించి.. ఆ దేశ విస్తరణవాదానికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
సమాచార దాడులు
లా అండ్ సొసైటీ అలయన్స్, డిఫెన్స్ క్యాపిటల్ అనే సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో నిపుణులు, మేధోమదన సంస్థల అధికారులు పాల్గొన్నారు. భారత టెలికాం మాజీ కార్యదర్శి ఆర్ చంద్రశేఖరన్, డేటా సార్వభౌమత్వ కార్యకర్త( సెంటర్ ఫర్ నాలెడ్జ్ సావర్నిటీ) వినీత్ గోయెంక, జర్నలిస్ట్ సిద్ధార్థ జరాబీ సహా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సమాచార ఆయుధం-5జీ, మొబైల్ యాప్స్ ద్వారా చైనా దాడులు' అనే అంశంపై సంభాషించారు.
ప్రజల అభిప్రాయాలు సహా మానవ ప్రవర్తనను మార్చేందుకు డేటాను శక్తిమంతమైన సాధనంగా ఉపయోగిస్తున్నారని టెలికాం మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది కొనసాగుతోందని తెలిపారు. శత్రుదేశాల్లోని ప్రజల అభిప్రాయాలను మార్చే భారీ ఆయుధం చైనా చేతిలో ఉందని హెచ్చరించారు.
"చైనా యాప్‌లు, 5జీ టెక్నాలజీ సంస్థలతో చైనా ప్రభుత్వానికి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి మరింత హానిని భరించలేము. కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికాం, కమ్యునికేషన్ రంగాల్లో మన సామర్థ్యాలను సొంతంగా అభివృద్ధి చేసుకోవడమే దీనికి పరిష్కారం. సామాజిక మాధ్యమాలు, టెలికాం సాంకేతికతలో చైనా ఆయుధీకరణకు వ్యతిరేకంగా ఉన్న ఏకైక మార్గం ఇదే."
-చంద్రశేఖర్, టెలికాం మాజీ కార్యదర్శి
5జీ సాంకేతికతలో సమాచార మార్పిడి టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారానే జరుగుతుందని చంద్రశేఖరన్ గుర్తుచేశారు. కాబట్టి నెట్వర్క్ మౌలిక సదుపాయాలు సురక్షితంగా లేకపోతే.. చైనా ముప్పును ఎదుర్కొలేమని తేల్చిచెప్పారు. సమాచార సమగ్రతను కాపాడేందుకు సీ-డీఓటీ, సీ-డీఏసీ వంటి ప్రభుత్వ రంగ సెక్టార్లు ప్రామాణిక పాత్ర పోషించాలని అన్నారు.
"5జీ నెట్వర్క్ విషయంలో హువావే, జడ్‌టీఈ వంటి సంస్థలను చైనా ప్రభుత్వం ప్రోత్సహించడం, టిక్‌టాక్ వంటి యాప్‌లు సామాజిక మాధ్యమాలను కీలకంగా నడిపించడం వెనక వలసరాజ్య లక్ష్యం దాగి ఉంది. ఇవన్నీ వలసవాదం కోసం సృష్టించిన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి ఆధునిక వెర్షన్లు."
-చంద్రశేఖర్, టెలికాం మాజీ కార్యదర్శి
ఇటీవల చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని వీటిపై ఉక్కుపాదం మోపింది. దీంతోపాటు చైనా కంపెనీలు భారత్‌లో మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంది. లద్దాఖ్‌లో గత రెండు నెలలుగా సైనిక ప్రతిష్టంభన నెలకొనడం, గల్వాన్ లోయలో భారత సైనికులపై హింసాత్మక దాడికి ప్రతిచర్యగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి- ఈ తప్పిదాలతో నేపాల్ స్నేహాన్ని భారత్ కోల్పోతోందా?