Charter flights: ఎన్నికలంటే రాష్ట్రాల్లో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇలా హోరెత్తిపోతుంటుంది. కీలక నేతలు తమ ప్రసంగాలు, హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తుంటారు. ఈ క్రమంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. ఒక్కోసారి ఒకేరోజు రెండు మూడు రాష్ట్రాల్లోని బహిరంగ సభలకు హాజరవ్వాల్సిన అవసరమూ ఉంటుంది. అందుకోసం ప్రత్యేక విమానాలను అద్దెకు తీసుకుంటుంటారు. దీంతో ఛార్టర్ ఫ్లైట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రచారం చప్పగా సాగుతోంది. దీంతో అద్దె విమానాలను అడిగేవారే లేకుండా పోయారు.
నెలలో 350-400 గంటల్లో కేవలం 10-15 శాతం మాత్రమే ఎన్నికల సంబంధిత ప్రయాణాలు ఉంటున్నాయని ఛార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లు చెబుతున్నారు.
"ఎన్నికల ప్రయాణాలు ఇంకా పుంజుకోలేదు. డిసెంబరు మధ్యలో కాస్త పెరుగుతున్నట్లు కనిపించింది. కానీ, అంతలోనే ఎన్నికల సంఘం ర్యాలీలపై నిషేధం విధించింది. చాలా పరిమిత స్థాయిలో ఎన్నికల ప్రయాణాలు జరుగుతున్నాయి."
- రాజన్ మెహ్రా, క్లబ్‌వన్ ఎయిర్ సీఈఓ
"ఈసీ నిషేధం నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే కేవలం 70 శాతం మాత్రమే ఎన్నికల సంబంధిత ప్రయాణాలకు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చాయి. పైగా వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ర్యాలీలపై నిషేధాన్ని పొడిగించిన నేపథ్యంలో ఈసారి పెద్దగా బిజినెస్ ఉండదనే భావిస్తున్నాం" అని జెట్‌సెట్‌గో ఏవియేషన్ సీఈఓ కనికా టెక్రీవాల్ తెలిపారు. జెట్‌సెట్‌గో, క్లబ్‌వన్ ఎయిర్ రెండింటికీ కలిపి ఛార్టర్ ఫ్లైట్‌ల కోసం వాడే 28 విమానాలు ఉన్నాయి.
ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ పరిస్థితులపై శనివారం సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఈ నెల 31 వరకు నిషేధాన్ని పొడిగించింది. ఇదివరకు విధించిన నిషేధ గడువు శనివారంతో పూర్తి కావడంతో అయిదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తర్వాత ఎన్నికల సంఘం కమిషనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: పరాగ్ మార్క్.. ట్విట్టర్లో కీలక ఉద్యోగులపై వేటు!