Central Taxes On Petrol Diesel: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై రికార్డు స్థాయిలో సుంకాలు పెంచడం వల్ల కేంద్రానికి కాసుల వర్షం కురిసింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు, పన్నులు, సెస్ రూపంలో కేంద్ర ఖజానాకు రూ.4.55లక్షల కోట్ల మేర ఆదాయం లభించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
"ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ రూపంలో రూ.2.02లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.25,430కోట్ల ఆదాయం రాగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు రూ.21,956కోట్లు, కర్ణాటకకు రూ.15,476కోట్లు, గుజరాత్‌కు రూ.15,141కోట్ల ఆదాయం సమకూరింది."
-- రామేశ్వర్ తెలి, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి
దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటడం వల్ల ఇటీవల కేంద్రం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్ రూ.10చొప్పున సుంకాన్ని తగ్గించింది.
ఆ తర్వాత చాలా రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించడం వల్ల వినియోగదారుడికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.88.67గా ఉంది.
ఇదీ చూడండి: బిగ్ బుల్‌కు బేర్ దెబ్బ- 10 నిమిషాల్లో రూ.230 కోట్లు ఉఫ్!