ప్రయాణీకుల వాహనంలో ముందు ఉండే రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన మంత్రిత్వ శాఖ.. కొత్తగా వచ్చే అన్ని మోడళ్ల వాహనాలు దీనిని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే తయారీ సంస్థలు త్వరితగతిన అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుందని తెలిపిన మంత్రిత్వశాఖ.. 2021 జూన్ 1 నుంచి.. ఇప్పటికే ఉన్న వాహనాలకు సైతం ఎయిర్ బ్యాగులు తప్పక అమర్చాలని ఆదేశించింది.
ప్రయాణాలు పదిలం..
కారు ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు వరుస నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం.. గతేడాది జులైలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్ నిబంధనను తెచ్చింది. తాజాగా డ్రైవర్ పక్కసీటులో ప్రయాణిస్తున్న వ్యక్తికి సైతం ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్ ట్రాన్స్‌పోర్టు, హైవే శాఖతో పాటు.. ఆటోమొబైల్ సంస్థలతో చర్చించి ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీనిలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రమాణాల్లో సవరణలకు అత్యుత్తమ సాంకేతిక కమిటీ ఆమోద ముద్ర లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
శరవేగ నిర్ణయాలు..
మోటార్ వాహన ప్రయాణికులను ప్రమాద సమయాల్లో కాపాడే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ ప్రయాణికుల భద్రతా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిబంధనల అమలుకు ఏడాది గడువు అవసరమని భావించినా.. ఏప్రిల్ నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్.. సహా ప్రయాణికుడి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి.
ఇదీ చదవండి: ప్రతి కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి!