Cement Price Hike: ఇళ్లు, భవనాలు నిర్మించేవారికి.. నిర్మించాలని అనుకుంటున్నవారికి భారీ షాక్ తగలనుంది. త్వరలోనే సిమెంట్ ధర పెరగనున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. కొన్నినెలల్లోనే బస్తాకు రూ.15 నంచి 20 పెరిగే అవకాశమున్నట్లు తెలిపింది. ఇదే జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక బస్తా ధర గరిష్ఠంగా రూ.400కు చేరవచ్చని అంచనా వేసింది.
Fuel Price Rise: బొగ్గు, డీజిల్ వంటి ఉత్పాదక వస్తువుల ధరల ఒత్తిడే సిమెంట్ రేట్లు పెరగడానికి కారణమవుతుందని క్రిసిల్ పేర్కొంది. తయారీ వ్యయం పెరగడం వల్ల ఉత్పత్తిదారులకు వచ్చే ఆదాయం టన్నుకు రూ.100 నుంచి 150 వరకు తగ్గుతుందని తెలిపింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు, పెట్‌కోక్ ధరల్లో పెరుగుదల కారణంగా సిమెంట్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతుందని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ విక్రయాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ 11 నుంచి 13 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఇది వ్యయాల ఒత్తిడిని తగ్గించి.. క్రెడిట్ ప్రొఫైల్‌లను స్థిరంగా ఉంచుతుందని పేర్కొంది. దేశంలోని 17 ప్రముఖ సిమెంట్ కంపెనీల విశ్లేషించి నివేదిక రూపొందించినట్లు క్రిసెల్ తెలిపింది.
అక్టోబరులో రూ.50 పెంపు
ఈ ఏడాది అక్టోబరులో దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు పెరిగాయి. అప్పుడు బస్తా ధర రూ.10 నుంచి 50 వరకు ఎగబాకింది. గరిష్ఠంగా దక్షిణ భారతదేశంలో రూ.50 ఎగబాకగా.. ఉత్తరాది ప్రాంతాల్లో రూ.12 పెరిగింది. దాంతో 50 కిలోల బస్తా సగటు ధర రూ.385కు చేరింది.
ఇదీ చూడండి: Gold Price Today: ఏపీ, తెలంగాణలో స్వల్పంగా తగ్గిన బంగారం ధర