చైనా వస్తువుల వినియోగాన్ని బహిష్కరించాలని 'ఇండియన్ గూడ్స్-అవర్ ప్రైడ్' పేరిట ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ). చైనా నుంచి దిగుమతి చేసుకునే 13 బిలియన్ డాలర్లు విలువ చేసే వస్తువులను 2021 డిసెంబరు నాటికి మొత్తం తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ ఉత్పత్తులకు బదులుగా భారత్లోనే తయారయ్యే 3,000 వస్తువులను వినియోగించవచ్చని జాబితా తయారు చేసింది.
సీఏఐటీలో 7 కోట్ల మంది వ్యాపారులున్నారు. 40 వేల వాణిజ్య సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రచారం నిర్వహిస్తోంది సీఏఐటీ.
చైనా నుంచి ప్రస్తుతం వస్తువులు, ముడి పదార్థాలు, విడి భాగాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటి నాలుగు రకాల దిగుమతులు చేసుకుంటున్నామని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలిపారు సీఏఐటీ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్. ప్రచారంలో భాగంగా మొదటి విడతలో చైనా వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
చైనా నుంచి భారత్ దిగుమతుల విలువ ప్రస్తుతం 70 బిలియన్ డాలర్లుగా ఉంది.