మాంద్యం ముప్పును ఎదుర్కొనేందుకు బడ్జెట్ రూపంలో పక్కా ప్రణాళిక ఆవిష్కరించింది కేంద్ర ప్రభుత్వం. మార్కెట్ డిమాండ్, కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాలపై భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు ఆదాయం రెట్టింపు చేసేందుకు 16 సూత్రాల ప్రణాళికను రూపొందించింది.
వ్యవసాయం
వ్యవసాయంలో భారీ పెట్టుబడుల ఆవశ్యకత ఉందని చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించినట్లు తెలిపారు. రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం చేయనున్నట్లు ప్రకటించారు నిర్మలా. రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సహాయం చేయనున్నట్లు వెల్లడించారు.
- గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు.
- రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాది కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
- 3,477 సాగర్మిత్ర, 500 మత్స్యకారుల సంఘాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.
- పీపీపీ పద్ధతిలో ఎఫ్సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
- గ్రామాల్లో ఏర్పాటు చేసే గిడ్డంగుల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
- పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
- ఉద్యానవన పంటల ఎగుమతి కోసం 'వన్ ప్రొడక్ట్, వన్ డిస్ట్రిక్ట్' విధానం ప్రతిపాదించారు.
- త్వరగా పాడయ్యే ఉత్పత్తుల(పాలు, చేపలు, మాంసం) మార్కెటింగ్ సదుపాయం మెరుగుపర్చేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో 'కిసాన్ రైల్' ఏర్పాటుకు ప్రతిపాదించారు.
మౌలికం
ఆర్థిక రంగానికి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు నిర్మలా. వచ్చే ఐదేళ్లలో 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 2019 డిసెంబర్ 31న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. దీనికోసం రూ.22,000 వేల కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు వెల్లడించారు.
రవాణా సౌకర్యాలు, హైవేల నిర్మాణానికి రూ.1.70 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 2,500 కిలోమీటర్ల ప్రవేశ నియంత్రణ రహదారులు(యాక్సెస్ కంట్రోల్ హైవేస్), 9 వేల కిలోమీటర్ల ఆర్థిక కారిడార్లు, 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
రైల్వే
27 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు నిర్మల. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో రైలు, ప్రఖ్యాత పర్యటక ప్రదేశాలకు మరిన్ని తేజస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు.
ఓడరేవులు
ఓడరేవుల విషయమై ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కనీసం దేశంలోని ఒక ఓడరేవును వాణిజ్యపరం చేసి స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.
గత ఐదేళ్లలో జలాంతర మార్గాలకు భారీగా ఊతమిచ్చామని చెప్పిన నిర్మలా... జల్వికాస్ మార్గ్ పథకంలోని నేషనల్ వాటర్వే-1 ను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.
విమానాశ్రయాలు
ఉడాన్ పథకం ద్వారా 2024 నాటికి దేశంలో 100 విమానాశ్రయాల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విమాన సర్వీసుల సంఖ్య 600 నుంచి 1,200లకు పెరుగుతుందన్నారు.
పునరుత్పాదక ఇందన వనరుల రంగానికి రూ.22,000 కోట్లను బడ్జెట్లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. గతేడాది బడ్జెట్లో కార్పొరేట్ పన్నుల్లో కోత విధించడం వల్ల ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం నష్టపోయిన నేపథ్యంలో... ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.8 శాతానికి పెంచారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 3.5 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.