ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. బీఎస్ఎన్ఎల్ ప్రాథమిక కనెక్షన్ ద్వారా పనిచేసే ల్యాండ్‌లైన్ లేదా మొబైల్ కనెక్షన్ ద్వారా ఎటువంటి వాణిజ్య కాల్స్, ఎస్ఎంఎస్లు చేయకూడదని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య కాల్స్, ఎస్ఎంఎస్లు చేస్తే...అలాంటి వారి మొబైల్ నెంబర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయడం కానీ, వాడకాన్ని రిస్ట్రిక్ట్ చేయడంగానీ చేస్తామని పేర్కొంది. ట్రాయ్ 2018 టీసీసీసీపీఆర్ నిబంధనల ప్రకారమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. కనుక వినియోగదారులు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోవాలని సూచించింది.
బీఎస్ఎన్ఎల్...కొత్త పోర్టల్
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్.. డీఎల్టీ అనే కొత్త పోర్టల్‌ను రూపొందించింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం, వినియోగదారులకు తమ ఉత్పత్తుల గురించి తెలియజేయాలనుకునేవారు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తమకు నిర్దేశించిన నంబర్ నుంచి మాత్రమే టెలిమార్కెటర్స్ కాల్స్, ఎస్ఎంఎస్లు లాంటివి చేసుకోవాలి.
అదే బాటలో....
సాధారణంగా తమ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండా... తమ నెట్వర్క్ ద్వారా కమర్షియల్ కాల్స్ చేసేవారికి టెలికాం ఆపరేటర్లు ఎప్పుడూ వ్యతిరేకమే. అందుకే ఎయిర్టెల్, వొడాఫోన్, జియో లాంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ... తమ వినియోగదారులు వాణిజ్యపరమైన వాయిస్ కాల్స్ చేసేందుకు అనుమతించడం లేదు.
వీటిలో ఎయిర్టెల్, వొడాఫోన్ మాత్రం ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి లేకుండా ట్రూలీ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారి నెంబర్లను బ్లాక్ చేసేందుకు తమకు పూర్తి హక్కులు ఉన్నాయని ఇప్పటికే ఆయా సంస్థలు స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి: భారత ఆర్థికస్థితి బలహీనంగా ఉంది: ఐఎమ్ఎఫ్