మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం (డాట్) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్ శాటిలైట్ సంస్థ ఇన్‌మర్సాట్ బుధవారం తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ పొందిన ఇన్‌ఫ్లైట్, మారిటైమ్ కనెక్టివిటీ(ఐఎఫ్‌ఎమ్‌సీ) లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయనానికి చెందిన భారత వినియోగదార్లకు జీఎక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మర్సాట్ వివరించింది. టారిఫ్‌లను ఇంకా నిర్ణయించలేదని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ పేర్కొన్నారు. నవంబరు నుంచి సేవలు అందించడానికి తమ వైపు నుంచి అంతా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. భారత్‌లో జీఎక్స్ గేట్‌వే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండబోతోంది.
అంతర్జాతీయ మార్గాల్లోనూ
భారత విమానయాన సంస్థలు భారత్‌తో పాటు, అంతర్జాతీయ మార్గాల్లోనూ జీఎక్స్ సేవలను అందించవచ్చు. విమానాల్లోపల కనెక్టివిటీని అందజేయవచ్చు. భారత వాణిజ్య నౌకా కంపెనీలు సైతం తమ నౌకలను డిజిటలీకరించవచ్చు. తద్వారా నౌకా కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమ సేవలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు.
ఈ ఏడాది చివర్లో సేవలు: స్పైస్‌జెట్
'ప్యాసింజరు ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీ సేవల్లో ముందున్న గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ మనదేశానికి విస్తరించడం సంతోషంగా ఉంది. మా వినియోగదార్లకు ఈ ఏడాది చివరి నుంచి ఈ సేవలు అందించాలని భావిస్తున్నాం. కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో వీటిని మొదలుపెడతాం' అని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే కొత్త జీఎఎక్స్ సేవల కోసం ఒప్పందాలు జరిగాయని ఇమర్సాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు.
సంతోషంగా ఉంది: ఇన్‌మర్సాట్ సీఈఓ
అంతర్జాతీయ హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ 'కేఏ-బాండ్' నెట్‌వర్క్‌ను భారత్‌లోని ప్రభుత్వ, వ్యాపారాలకు మా భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో మరింత ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది.. మరింత సామర్థ్యంతో సేవలందించేందుకు మూడేళ్లలో మరో ఏడు జీఎక్స్ శాటిలైట్లను ప్రయోగిస్తాం.
- ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలందిస్తున్న గ్లోబల్ ఎక్స్‌ప్రెస్‌ను భారత వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఏజీఆర్ బకాయిల వాయిదాకు వొడాఫోన్ ఐడియా ఓకే!