హాయ్! మీరు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా? ఇప్పటి వరకు వివిధ ప్రీపెయిడ్ ప్లాన్లతో అపరిమిత ఉచిత కాల్స్‌ను పొందుతున్నారా? అయితే ఇకపై మీకా అవకాశం లేనట్లే. ఎందుకంటారా? మీరే చూడండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) చందాదారులను ఆకర్షించడం కోసం ఇప్పటి వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను, అనేక ఆకర్షణీయ ఆఫర్లనూ అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చింది. ఇప్పటి వరకు వివిధ ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా అందిస్తున్న ఉచిత అపరిమిత కాల్స్‌పై పరిమితి విధించింది. ఇకపై బీఎస్ఎన్ఎల్ చందాదారులు రోజుకు 250 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేయగలుగుతారు. ఇది వారికి తీవ్ర నిరాశ కలిగించే అంశం.
విపరీతమైన పోటీ ఉన్న ఈ టెలికాం రంగంలో ఇప్పటికే వెనుకబడి ఉన్న ఈ ప్రభుత్వ సంస్థ... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనూహ్యం.
వీక్లీ కాలింగ్ క్యాప్
రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.1,699 విలువైన ప్రీపెయిడ్ వోచర్లతో ఇకపై అపరిమిత ఉచిత కాలింగ్ సౌలభ్యం ఉండదని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఒక రోజులో లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అన్నీ కలిపి 250 నిమిషాలు మాత్రమే ఉచిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. అది సొంత నెట్వర్క్ అయినా, ఇతర నెట్వర్క్లైనా సరే. ఈ పరిమితికి మించి కాల్స్ చేస్తే మాత్రం అదనపు ఛార్జీలు తప్పవు.
అంటే ఒక చందాదారుడు 1 పైసా/ సెకెన్‌కు కాల్ చేయడానికి అనుమతించే బేస్ టారిఫ్ కలిగి ఉన్నాడనుకుందాం. అతను ఒక రోజులో 250 నిమిషాల కాల్ పరిమితిని అధిగమించినట్లయితే అదే ధర వద్ద ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిందే. ఇది ఆ రోజు రాత్రి 12 వరకు ఉంటుంది. రెండో రోజు మళ్లీ 250 నిమిషాల ఉచిత కాలింగ్ సమయం మీకు అందుబాటులోకి వస్తుంది.
'అభినందన్'తో.... అపరిమిత కాలింగ్
బీఎస్ఎన్ఎల్ తన చందాదారుల కోసం కొత్తగా అభినందన్ రూ.151 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌పై 50 శాతం ఎక్కువ డేటాను తన చందాదారులకు అందిస్తోంది. అభినందన్ ప్లాన్‌పై ఇప్పటి వరకు రోజుకు 1 జీబీ డేటా మాత్రమే అందిస్తున్న టెల్కో దానిని 1.5 జీబీకి పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్నీ అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ బాటలోకి వెళ్తాయా?
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మొదటిసారిగా తన చందాదారులకు ఉచిత అపరిమిత కాలింగ్ సౌలభ్యం కల్పించింది. ఇది టెలికాం మార్కెట్‌ను దశ, దిశను మార్చివేసింది. అప్పటి వరకు రోజుకు 250 నిమిషాల ఉచిత కాలింగ్ సౌలభ్యం మాత్రమే అందిస్తూ వచ్చిన ఎయిర్టెల్, వొడాఫోన్ రూటు మార్చుకున్నాయి. పోటీని తట్టుకునేందుకు వాయిస్ కాలింగ్ క్యాప్ తొలగించి, తమ చందాదారులకూ అపరిమిత ఉచిత కాలింగ్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఇంతటి పోటీ వాతావరణంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 'ఉచిత కాలింగ్'పై పరిమితిని విధించింది. మరి ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలు ఈ బాటలోకి వస్తాయో? లేదో?
ఇదీ చూడండి: బ్యాంకింగ్, వాహన రంగాల ఊతంతో లాభాలు