బీఎస్ఎన్ఎల్ (భారతీయ సంచార నిగం లిమిటెడ్) తమ విక్రయదారులకు రూ.1700 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. ఉద్యోగులకూ నవంబరు నెలలో ఇవ్వాల్సిన జీతాలను సంస్థ చెల్లించిందన్నారు. నెలవారీ వేతన వ్యయం సుమారు రూ. 800 కోట్లుగా పేర్కొన్నారు.
పునరుద్ధరణ ప్యాకేజీ
ఈ ఏడాది అక్టోబర్లో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ల కోసం రూ.60,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నష్టాల్లో మునిగిపోయిన ఈ రెండు సంస్థల విలీనం, ఆస్తులను మోనిటైజింగ్, ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్) సౌకర్యం కలిగించడం ద్వారా రెండేళ్లలో ఈ సంయుక్త సంస్థను లాభదాయకం మార్చాలని నిర్ణయించింది.
అందుకే విలీనం
ముంబయి, దిల్లీలకు 'మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్' టెలికాం సేవలందిస్తోంది. మిగతా దేశమంతటికీ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' సేవలందిస్తోంది. ఎమ్టీఎన్ఎల్ గత పదేళ్లుగా, బీఎస్ఎన్ఎల్ 2010 నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని.. కలిపే ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.
వీఆర్ఎస్తో తగ్గనున్న రుణ భారం
ఈ మధ్యకాలంలో రెండు సంస్థలూ వీఆర్ఎస్ ప్రణాళికను ప్రారంభించాయి. ఈ కంపెనీలకు చెందిన చాలామంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా రుణ భారాన్ని మోస్తున్న టెలికాం కంపెనీలకు జీతాల్లో నుంచి ఏటా రూ.8,800 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులు మోనిటైజ్ చేయనున్నాయి.
ఇదీ చూడండి: 'పీఎంసీ కుంభకోణం కేసును క్షుణ్ణంగా పర్వవేక్షిస్తున్నాం'