ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, స్థూల ఆర్థిక గణాంకాలు, దీర్ఘకాలిక బాండ్ల ఆదాయం.. ఇలా అనేక అంశాలు ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపే కారకాలుగా ఉండనున్నాయి.
ఫిబ్రవరి నెలకు సంబంధించి వాహన విక్రయ, సేవా, తయారీ రంగాల ఔట్పుట్ గణాంకాలపై విదేశీ, దేశీయ మదుపరులు దృష్టి సారించే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశమంటున్నారు.
"బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లలో ఒడుదొడుకులు ఉండొచ్చు. మదుపరులు బాండ్ల ఆదాయం, భౌగోళిక పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించొచ్చు. అమెరికా కొత్త ఉద్దీపన ప్యాకేజీ కీలకంగా మారొచ్చు."
- సిద్ధార్థ్ ఖింకా, మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ పరిశోధనా విభాగాధిపతి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 0.4 శాతంగా నమోదైనట్లు జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. నిజానికి వృద్ధి రేటు 0.8 శాతంగా నమోదవ్వొచ్చని అంచనాలు వెలువడ్డాయి. అధికారిక గణాంకాలు ఇందుకు విరుద్ధంగా ఉండటం వల్ల మార్కెట్లపై ఈ ప్రభావం కీలకంగా కనిపించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వీటన్నింటితో పాటు రూపాయి కదలికలు, అంతర్జాతీయంగా కరోనా కేసులు, టీకా వార్తలూ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చదవండి:ఆ నిబంధన కొత్తది కాదు- కేంద్రం వివరణ