gautam adani net worth 2021: అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీ సంపద ఏడాది (2021) కాలంలోనే 41.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,10,000 కోట్లు) పెరిగి 75.3 బిలియన్ డాలర్లకు (రూ.5,60,000 కోట్లు) చేరింది. దేశంలోనే అత్యంత శ్రీమంతుడైన ముకేశ్ అంబానీ కంటే విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీయే 2021లో ఎక్కువ సంపదను పెంచుకున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ సంపద 15.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,18,000 కోట్లు) పెరగ్గా, ముకేశ్ సంపద విలువ 13 బి.డాలర్లు (రూ.97,500 కోట్లు) అధికమైందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ తెలిపింది. ముకేశ్ సంపద 89.7 బిలియన్ డాలర్లుగా (రూ.6,70,000 కోట్లు), ప్రేమ్‌జీ సంపద 41.2 బి.డాలర్లుగా (రూ.3,04,000 కోట్లు) నమోదయ్యాయి. అయితే ఈ సూచీ ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 మంది శ్రీమంతుల్లో భారతీయులెవరూ లేరు.
- అదానీ గ్రూపునకు చెందిన చాలా కంపెనీలు 2021లో మదుపర్లకు గణనీయ ప్రతిఫలాలను అందించాయి. అదే సమయంలో గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగేందుకూ ఇది దోహదం చేసింది. అదానీ గ్రూపులోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఏడాది కాలంలో 245 శాతం రాణించాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 288%; అదానీ టోటల్ గ్యాస్ 351.42 శాతం చొప్పున పెరిగాయి.
- ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏడాది మొత్తం మీద 18.6% ప్రతిఫలాలను పంచాయి. సెన్సెక్స్ లాభపడిన దానితో (21.99%) పోలిస్తే ఇది తక్కువ.
- విప్రో షేర్లు ఈ ఏడాది 84 శాతం దూసుకెళ్లడం అజీమ్ ప్రేమ్‌జీ సంపద పెరిగేందుకు తోడ్పడింది.
- డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) ప్రమోటరు రాధాకిషన్ దమానీ సంపద 9.51 బిలియన్ డాలర్లు పెరిగి 24.4 బిలియన్ డాలర్లకు చేరింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు 66 శాతం పెరిగాయి.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు 39 శాతం మేర రాణించడంతో శివ్ నాడార్ సంపద 8.4 బిలియన్ డాలర్లు అధికమై 32.5 బిలియన్ డాలర్లకు చేరింది.
- సావిత్రి జిందాల్ సంపద 5.82 బి.డాలర్లు పెరగ్గా, కుమార మంగళం బిర్లా 5.02 బి.డాలర్లు, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) 4.28 బి.డాలర్లు, కేపీ సింగ్ (డీఎల్‌ఎఫ్) 3.61 బి.డాలర్లు, ఫల్గుణి నాయర్ (నైకా) 3 బి.డాలర్ల చొప్పున సంపదను పెంచుకున్నారు.
- నైకా షేర్లు తొలి రోజే ఇష్యూ ధరకు రెట్టింపుగా నమోదవ్వడంతో భారత్‌లో స్వయంశక్తితో ఎదిగిన మహిళల్లో అత్యంత శ్రీమంతురాలిగా ఫల్గుణి అవతరించారు.
ఇదీ చూడండి: యాపిల్‌కు సీసీఐ షాక్- సమగ్ర దర్యాప్తునకు ఆదేశం