ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కరోనా నియంత్రణ టీకా 'కొవాగ్జిన్' ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకాకు ఒక్కో డోసు ధర రూ.600లు కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు ధరను రూ.1200లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని వెల్లడించింది.
కరోనాను నివారించడంలో కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇటీవల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. మూడో దశ క్లినికల్ పరీక్షల రెండో మధ్యంతర ఫలితాలను బుధవారం వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ టీకా తేలికపాటి, మధ్య స్థాయి, తీవ్రమైన కొవిడ్ వ్యాధిపై 78శాతం ప్రభావశీలత కనబరిచిందని తెలిపింది. దీన్ని తీసుకుంటే తీవ్రమైన కరోనా వ్యాధితో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం లేవని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: 'మహా' విలయం- ఒక్కరోజే 67వేల మందికి కరోనా
ఇదీ చూడండి: భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు