ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19కి టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 'కరోఫ్లూ' అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించే ప్రక్రియలో తమతో పాటు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్ శాస్త్రవేత్తలు, టీకా కంపెనీ అయిన ఫ్లూజెన్ పాలు పంచుకుంటున్నట్లు, ఈ మేరకు ఒక ‘అంతర్జాతీయ భాగస్వామ్యం’ కుదిరినట్లు శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. ముక్కు ద్వారా ఇచ్చేలా 'ఇంట్రా నాసల్' వ్యాక్సిన్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
టీకా ఆధారంగా కరోనా వ్యాక్సిన్..
'ఫ్లూజెన్' కు చెందిన 'ఎం2 ఎస్‌ఆర్' అనే ప్రయోగాత్మక ఫ్లూ టీకా ఆధారంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్- మాడిసన్ శాస్త్రవేత్తలు, ఫ్లూజెన్ సహ వ్యవస్థాపకులైన యోషిహరో కవోక, గాబ్రియేట్ నూమాన్ 'ఎం2 ఎస్‌ఆర్' సృష్టికర్తలు. ఈ టీకాకు ఫ్లూ వ్యాధి రాకుండా ఎదుర్కొనే శక్తి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు కారణమవుతున్న నావెల్ కరోనా వైరస్‌ను, 'ఎం2 ఎస్‌ఆర్' లోకి ప్రవేశపెట్టి దాన్ని కరోనా వైరస్ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్‌గా తయారు చేయబోతున్నారు.
30 కోట్ల డోసుల వ్యాక్సిన్..
ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వ్యాపారాభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్ రేచస్ ఎల్లా స్పందిస్తూ- ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేయటమే కాకుండా క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయటానికి వీలుగా 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేయాలనుకుంటున్నామని అన్నారు.
వ్యాక్సిన్ తయారీ- క్లినికల్ పరీక్షల నిర్వహణకు వీలుగా ఫ్లూజెన్ వద్ద ఉన్న తయారీ పరిజ్ఞానం భారత్ బయోటెక్‌కు బదిలీ అవుతుందని ఆయన తెలిపారు. "హెచ్1ఎన్1 ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు ఇప్పటి వరకూ 16 రకాల వ్యాధులకు టీకాలు తయారు చేశాం" అని వివరించారు.
ఏడాది చివర్లో మనుషులపై ప్రయోగం!
'కరోఫ్లూ' వ్యాక్సిన్‌కు తుది రూపం ఇచ్చి, దానిపై ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించటానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని భారత్ బయోటెక్ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరాంతానికి మనుషులపై ప్రయోగాలు నిర్వహించే స్థాయికి వచ్చే అవకాశం ఉంది. "ఎం2 ఎస్‌ఆర్‌ను స్వల్పంగా మార్చి దాన్లో కరోనా వైరస్ ప్రొటీన్‌ను ప్రవేశపెడతాం. ఫలితంగా అది.. కరోనా వైరస్‌పై పోరాడేలా మనిషి శరీరంలోని రోగ నిరోధకశక్తిని తీర్చిదిద్దుతుంది" అని కవోకా ల్యాబ్‌లో సీనియర్ వైరాలజిస్ట్, ఫ్లూజెన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన గాబ్రియేట్ నూమాన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ను కూడా ముక్కు ద్వారా ఇచ్చేలా తయారు చేస్తున్నారు.
ఇదీ చూడండి:అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!