వ్యక్తిగత పన్నుల చెల్లింపు కోసం కేంద్రం మినహాయింపులు తొలగిస్తూ నూతన శ్లాబ్ రేట్లు ప్రకటించింది. మొత్తం 7 శ్లాబ్‌లు ప్రకటించింది. చెల్లింపుదారులు ఇప్పుడున్న శ్లాబ్‌ల ప్రకారం కూడా పన్ను చెల్లించే అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయంపై పలువురు నిపుణులు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త ప్రతిపాదన పెట్టుబడులకు అతిపెద్ద విఘాతంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
"నూతన ఐచ్ఛిక విధానం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమకు ఏది ఉత్తమమైనదో ఎంచుకోవాల్సి ఉంటుంది. 80సీ ద్వారా దీర్ఘ కాల పొదుపు కోసం కట్టుబడి ఉన్నవారు నిరాశకు లోనవుతారు. ట్యాక్స్ సేవింగ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టేవారిని ఇది నిరుత్సాహపరుస్తుంది."-అర్చిత్ గుప్తా, క్లియర్ ట్యాక్స్ స్థాపకుడు
మినహాయింపులు, డీడీటీ తొలగించడం వంటివి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను నష్టానికి గురి చేస్తాయని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ట్వీట్ చేశారు.
విస్తృతంగా ఆశించిన వ్యక్తిగత పన్ను తగ్గింపులు అనేక షరతులతో లభించాయని రిలిగేర్ బ్రోకింగ్ అధికారి అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రతిపాదనల వల్ల పెట్టుబడి మార్కెట్లో సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం లేదన్నారు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అధికారి ధీరజ్ రెల్లీ.
పలువురు సానుకూలం
మరోవైపు పలువురు విశ్లేషకులు కేంద్రం ప్రతిపాదనను స్వాగతించారు. నూతన పన్ను విధానం ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తుందని ఆదిత్య బిర్లా లైఫ్‌కు చెందిన కమ్లేష్ రావ్ తెలిపారు.
వ్యక్తిగత పన్ను శ్లాబ్‌లను కుదించడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని గోద్రెజ్ (వినియోగదారు ఉత్పత్తుల) అధినేత వివేక్ గంభీర్ అన్నారు. తద్వారా వినియోగించలేని సంపద పెరిగి, డిమాండ్‌ను నిర్దేశిస్తుందని తెలిపారు.
వినియోగం పెరగడంలో వ్యక్తిగత పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కీలకంగా వ్యవహరిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అధికారి విజయ్ ఛందోక్ అభిప్రాయపడ్డారు.