బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు తరచూ తగ్గుతున్నాయి. ఆర్థిక మందగమనం పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ ఇవి మారే వీలుంది. ఈ పరిస్థితుల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన డిపాజిట్లపై అధిక వడ్డీ వచ్చేలా చూసుకోవచ్చు.
వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించడానికి, తగ్గిన వడ్డీ రేట్లు అమల్లోకి రావడానికి మధ్య సాధారణంగా రెండు, మూడు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే మీరు ఏం చేయాలన్నది చాలా కీలకం. మన అవగాహన కోసం... ఆగస్టు నెలలో రెండు సార్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమి చేస్తే బాగుండేదో తెలుసుకుంటే.. భవిష్యత్తులో ఏం చేయాలనే అవగాహన వస్తుంది.
సెలవుల్లో ఆన్‌లైన్-తెలివైన డిపాజిట్...
తగ్గించిన వడ్డీ రేట్లు అమల్లోకి రావడానికి రెండు, మూడు రోజుల కన్నా ఎక్కువ వ్యవధి ఉండదు. ఈ రెండు రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మన డబ్బులను డిపాజిట్ చేసుకోవడం కుదరదు. కాబట్టి, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యంతో డిపాజిట్ చేసుకుంటే.. భవిష్యత్తులో వడ్డీ రేటు తగ్గినా, డిపాజిట్ అయిన మొత్తంపై వడ్డీ తగ్గదు. బ్యాంకులు అందిస్తోన్న యాప్‌ల ద్వారా కూడా డిపాజిట్-రద్దు చేసుకోవచ్చు.
తెలుసుకోండి-తేదీల మాయ
సెప్టెంబర్ 13 నుంచి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని బ్యాంకు 10వ తేదినే ప్రకటించింది అనుకుందాం. సెప్టెంబర్ 12 లోగా ఒక సంవత్సరానికి డిపాజిట్ చేస్తే 6.8శాతం వడ్డీ వచ్చేది. సెప్టెంబర్ 13న లేదా ఆ తర్వాత ఎఫ్డీ చేస్తే 6.7% వస్తుంది. ఎక్కువ వడ్డీ వస్తుందని మీరు ఏడాది కాలానికి సెప్టెంబర్ 12న రూ.10లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. మధ్యలో ఓ రూ.50వేలు అవసరం అయితే.. డిపాజిట్‌ను రద్దు చేసుకోకుండా ఆ డిపాజిట్‌పై రుణం తీసుకోవచ్చు. రుణం కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో లేదా మొబైల్ యాప్‌లో రుణానికి దరఖాస్తు చెయ్యొచ్చు. డిపాజిట్‌పై వడ్డీకన్నా.. తీసుకున్న రుణంపై 1-2 శాతం వరకూ అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మొత్తం రూ.10లక్షలు అవసరమయితే డిపాజిట్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్నప్పుడు మన రూ.10లక్షలపై డిపాజిట్ గడిచిన కాలానికి వర్తించే వడ్డీలో 1 శాతం తగ్గించి చెల్లిస్తారు.
రికరింగ్ డిపాజిట్.. ప్రస్తుత రేటే భవిష్యత్‌లోనూ...
మీ వద్ద డిపాజిట్ చేయడానికి ఎక్కువ డబ్బు లేదు. అయినా ప్రస్తుత వడ్డీ ప్రకారం భవిష్యత్తులో క్రమం తప్పకుండా డిపాజిట్ చేసే మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీ రావాలంటే.. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో ప్రతి నెలా జమయ్యే మొత్తానికీ మీరు డిపాజిట్ ప్రారంభించినప్పుడు ఉన్న వడ్డీ రేటు కొనసాగుతుంది.
ఫ్లెక్సీ డిపాజిట్... చెల్లించే మొత్తంలో హెచ్చు తగ్గులూ సాధ్యమే
రికరింగ్ డిపాజిట్‌లో ప్రతి నెలా చెల్లించే మొత్తం స్థిరంగా ఉండాలి. భవిష్యత్తులో ఏ నెలలోనైనా ఎక్కువ మొత్తం చెల్లించాలి అనుకుంటే బ్యాంకులలో ప్రత్యేక రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉంటాయి. ఉదాహరణకు ఎస్‌బీఐలో ఫ్లెక్సీ డిపాజిట్ ప్రారంభిస్తే ఏ సంవత్సరంలోనైనా కనీసం రూ.5వేలు, గరిష్ఠంగా రూ.50వేలను డిపాజిట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రారంభించినప్పుడు ఉన్న వడ్డీ రేటు భవిష్యత్తులో చెల్లించే మొత్తానికి వర్తిస్తుంది.
అవసరమైతే..ఎఫ్డీపై రుణం
బ్యాంకులో రూ.10లక్షల డిపాజిట్ ఉందని అనుకుందాం. ఒక వారంలో ఆ డిపాజిట్ గడువు ముగిసే సందర్భంలో ఆ డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే.. ముందస్తు రద్దు కింద పెనాల్టీ కింద కొంత తగ్గిస్తారు. ఇటువంటి సమయాల్లో డిపాజిట్‌ను రద్దు చేయకుండా దానిపై రుణం తీసుకోవడం మేలు. డిపాజిట్ గడువు తీరాక ఆ రుణాన్ని తీర్చేయండి. దీనివల్ల స్వల్పకాలపు అవసరానికి పెద్ద ఇబ్బంది లేకుండా, తక్కువ వడ్డీ రాకుండా చూసుకోవచ్చు.
పెద్దల పేరుతో అధిక మొత్తం..
60 ఏళ్లు నిండిన పెద్దల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 0.5%-1% వరకూ అధిక వడ్డీనిస్తుంటాయి బ్యాంకులు. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల పేరుమీద డిపాజిట్ చేయడం ద్వారా కొంత అధిక వడ్డీకి ఆస్కారం ఉంటుంది. నామినీ పేరు పేర్కొనడం మాత్రం తప్పనిసరి.
పొదుపు ఖాతాలోని సొమ్ముకు స్వల్పకాలిక ఎఫ్డీ
ఎన్ని లెక్కలు తెలిసినా, చాలామంది తమ పొదుపు ఖాతాలో ఉన్న అధిక నిల్వలలను డిపాజిట్ చేయడంపై అశ్రద్ధ చేస్తుంటారు. బ్యాంకులలో సేవింగ్ ఖాతాలో 3%, 3.5% వడ్డీకి మిగులు నిల్వలను ఉంచుకునే బదులు కనీసం 7 రోజులకు కూడా డిపాజిట్ చేసుకుని అధిక వడ్డీ పొందవచ్చు. ఆ 7 రోజుల డిపాజిట్‌ను కూడా ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. 7 రోజుల్లోగా వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ రాదు. ఆన్‌లైన్, బ్యాంక్ యాప్‌ల ద్వారా ఈ డిపాజిట్‌ను చేయడానికి ప్రయత్నించండి.
బ్యాంకు పేరు మారినా ఇబ్బంది లేదు..
తాజాగా బ్యాంకుల విలీనం ప్రతిపాదన నేపథ్యంలో చాలామందికి ఒక సందేహం వస్తోంది. ఒక బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు.. అది వేరే బ్యాంకులో విలీనం అయితే మన డిపాజిట్‌కు ఏం అవుతుంది? మీరు డిపాజిట్ చేసిన బ్యాంకు వేరే బ్యాంకులో విలీనమై పేరు మార్చుకున్నా.. ఏ ఇబ్బందీ ఉండదు. మీరు డిపాజిట్ చేసినప్పుడు ఉన్న వడ్డీ రేటే కొనసాగుతుంది. ఉదాహరణకు మీరు పదేళ్ల వ్యవధికి 6.75 శాతం వడ్డీకి డిపాజిట్ చేశారనుకుందాం. ఈలోగా ఆ బ్యాంకు మరో బ్యాంకులో కలిసిపోయింది. ఆ కొత్త బ్యాంకులో పదేళ్ల డిపాజిట్‌కు 6శాతం వడ్డీ ఇస్తున్నారని అనుకుందాం. అయినప్పటికీ.. మీ డిపాజిట్ కాల వ్యవధి పదేళ్లు పూర్తయ్యేదాకా.. 6.75శాతం వడ్డీ కొనసాగుతుంది. మీరు డిపాజిట్ చేసినప్పుడు ఉన్న ఇతర నిబంధనలూ కాల పరిమితి ముగిసే వరకూ మారవు.
- వంగా రాజేంద్ర ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ఇదీ చూడండి: జియో గిగాఫైబర్‌లో కొత్త ట్విస్ట్- కేబుల్ టీవీ కష్టమే!