బ్యాంకుల ద్వారా రెండు వేల నోట్లతో పోలిస్తే, ఐదు వందల రూపాయల నోట్లే ఎక్కువ చలామణిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోటుకు బదులు రూ.500 నోటుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
ఏటీఎంలలో రెండువేల నోట్లను ఉపయోగించడం ఇదివరకే ఆపేసినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంకులు తక్కువ విలువైన నోట్లకు అనుగుణంగా తమ ఏటీఎం యంత్రాలను మార్చుకునేందుకూ కసరత్తులు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోయినా.. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముద్రణ ఆపేశారు
రెండు వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. గతేడాది దాఖలు చేసుకున్న సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ఇచ్చిన జవాబులో ఈ విషయం తెలియజేసింది.
ఆర్బీఐ ఇచ్చిన వివరాల ప్రకారం... 2016-17లో రూ.2 వేలు విలువ కలిగిన 3,542.9 మిలియన్ల నోట్లను ముద్రించింది. అయితే 2017-18 నాటికి ఈ సంఖ్య 111.5 మిలియన్లకు పడిపోయింది. 2018-19కి మరింత దిగజారి 46.69 మిలియన్లకు పరిమితమైంది.
అధిక విలువ గల ఈ నోట్లు చట్టప్రకారం చెల్లుబాటైనా... మార్కెట్లో క్రమక్రమంగా కనిపించకుండా పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
రద్దు చేసేది లేదు
అయితే రు.2 వేల నోటును రద్దు చేసేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే తేల్చి చెప్పారు. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.
ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016 నవంబర్ 4 నాటికి 17,74,187 కోట్ల నగదు(నోట్ల రూపంలో) చలామణిలో ఉండగా... 2019 డిసెంబర్ 2 నాటికి ఈ సంఖ్య రూ.22,35,648 కోట్లకు చేరుకుంది.