కొవిడ్-19 టీకా తయారీకి అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యునైటెడ్ బయోమెడికల్ ఇంక్.. అనే సంస్థకు సబ్సిడరీ అయిన కొవాక్స్ తో హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కొవాక్స్కు చెందిన మొదటి మల్టీటోప్ పెప్టెడ్- ఆధారిత కొవిడ్-19 టీకా, యూవీ-612 ను అరబిందో ఫార్మా అభివృద్ధి చేస్తుంది. టీకా తయారు చేసి మనదేశంలో, యునిసెఫ్(యునైడెట్ నేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్)కు సరఫరా చేస్తుంది. కొవాక్స్ టీకాపై ప్రస్తుతం అమెరికాలో మొదటి దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికంలో అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో నిర్వహించాలని ఈ సంస్థ భావిస్తోంది.
కొవాక్స్తో ఒప్పందం ప్రకారం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేసి హైదరాబాద్లోని తమ యూనిట్లో తయారు చేస్తామని అరబిందో ఫార్మా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీకి టీకా తయారీ కోసం 22కోట్ల డోసుల వార్షిక సామర్థ్యం ఉంది. వచ్చే జూన్ నాటికి ఈ సామర్థ్యాన్ని 48 కోట్ల డోసులకు పెంచుకోనుంది. కొవాక్స్తో కలిసి పనిచేసే అవకాశం లభించడంపై అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ సంతోషం వెలిబుచ్చారు.
కొవిడ్-19 టీకాను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలంటే, బలమైన ప్రాంతీయ భాగస్వామ్యాలు అవసరమని కొవాక్స్ వ్యవస్థాపకుడు- సీఈఓ మీ మీ హు వివరించారు. ఈ దిశగా చూస్తే అరబిందో ఫార్మా తమకు సరైన భాగస్వామిగా అభివర్ణించారు. బ్రెజిల్, ఈక్వడార్, పెరూ.. తదితర దేశాలకు 14 కోట్ల డోసుల టీకా సరఫరా చేయడానికి ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గత నెలలో వెల్లడించింది కొవాక్స్.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్ అభివృద్ధికి రూ.500 కోట్లు'