విమానాల్లో వాడే ఇంధనం ధర కిలో లీటర్కు రూ.4,734.15 పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం వెల్లడించిన నివేదిక ప్రకారం కిలో లీటర్ విమాన ఇంధన ధర రూ. 62,795.12గా ఉంది.
గత 4 నెలల్లో విమాన ఇంధన ధరలు పెరగటం ఇదే ప్రథమం. ప్రతినెల ప్రారంభంలో అంతర్జాతీయ సగటు ఇంధన ధరలకు అనుగుణంగా, విదేశీ మారకం రేటు ఆధారంగా దేశీయ ఇంధన ధరలను సవరిస్తారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఫిబ్రవరి 1న ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంతకుముందు జనవరిలో రికార్డు స్థాయిలో 14.7 శాతం(కిలో లీటర్కు రూ.9,990), డిసెంబరులో 10.9 శాతం(కిలో లీటర్కు రూ.8,327.83) మేర ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
కొన్ని నెలలుగా దిగివస్తున్న ఇంధన ధరలు రుణభారంతో కూరుకుపోయిన విమానయాన సంస్థలకు కాస్త ఊరటనిచ్చాయి. ఇప్పుడు ధరలు పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో ఆయా సంస్థల లాభాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.81, డీజిల్ ధర రూ.67.12. విమాన ఇంధనం మాత్రం లీటరుకు రూ.62.79 గా ఉండటం గమనార్హం.