అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరంగా సరికొత్త అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటించిన కఠినమైన విధానాల్లో.. బైడెన్ రాకతో భారీ మార్పులు రావచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి.
ట్రంప్ పక్కనబెట్టిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ), పారిస్ అగ్రిమెంట్ వంటి అంశాలు మళ్లీ చర్చకు రావచ్చని బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న బేస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎన్.ఆర్.భానుమూర్తి 'ఈటీవీ భారత్' తో అన్నారు.
ట్రంప్ పాలనలో వాణిజ్య విధానాలు ఇలా..
2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాణిజ్య భాగస్వాములతో వ్యవహరించే విధానంలో భారీ మార్పులు చేశారు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' ప్రచారంలో భాగంగా దేశీయంగా పరిశ్రమలు, ఉద్యోగాల రక్షణకు ప్రాధన్యమిచ్చే విధానాన్ని పాటించారు. ఐరోపా సహా ప్రపంచ వాణిజ్యంలో రక్షణవాదం తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్‌పైనా ప్రభావం..
ట్రంప్ పాటించిన ఈ రక్షణవాదం భారత్‌కూ ఇబ్బందికరంగా మారింది. 'ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ' (జీఎస్పీ) హోదాను ఉపసంహరించుకోవడం వల్ల.. దాదాపు 5 బిలియన్ డాలర్ల భారత ఎగుమతులపై ప్రభావం పడింది. ఇవి మాత్రమే కాకుండా అమెరికాకు ఎగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం వంటి వాటిపై సుంకాలను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
వాణిజ్య విధానాల్లో ట్రంప్ కఠినంగా వ్యవహరించేవారని, ఆయనలా ఇంకెవరూ ఉండకపోవచ్చని ఎన్.ఆర్.భానుమూర్తి అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మాత్రమే కాకుండా యంత్రాంగంలోనూ అలాంటి వారే ఉన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ ఈ లైట్నర్ కూడా వాణిజ్య చర్చల్లో అత్యంత కఠినమైన విధానాన్ని అనుసరించే వారని పేర్కొన్నారు భానుమూర్తి. ఈ కఠినమైన విధానాల వల్ల చాలా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాలు ప్రభావితమయ్యాయని తెలిపారు.
ట్రంప్ భారత పర్యటనలో పరిమిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయకపోవడానికి ఇదీ ఒక కారణమైందనే వాదనలు ఉన్నాయి.
చైనాతో వాణిజ్య యుద్ధం..
చైనాతో వాణిజ్య యుద్ధానికి కూడా ట్రంప్ తెరలేపారు. అమెరికాకు చేసే చైనా ఎగుమతులపై పలుమార్లు సుంకాలు పెంచారు. భద్రతా పరమైన కారణాలతో చైనాకు చెందిన టెలికాం దిగ్గజాలు హువావే, జెడ్‌టీఈలపై ఆంక్షలు విధించారు. అమెరికా కంపెనీలు.. చైనా టెలికాం టెక్నాలజీల కొనుగోలుపైనా పలు ఆంక్షలు అమలు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం.. చాలా దేశాలకు ఊరట కలిగించింది. ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు మెరుగవుతాయనే ఆశలు ఆయా దేశాల్లో మళ్లీ చిగురిస్తున్నాయి. బెైడెన్ రాకతో అమెరికా పాలన యంత్రాంగంలోని ప్రధాన విభాగాల్లో పని చేసే అధికారుల్లో భారీ మార్పులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య, వ్యాపార పరమైన విధానాల్లో బైడెన్ యంత్రాంగం సానుకూల ధోరణితో వ్యవహరించే వీలుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.