రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రో రసాయనాల వ్యాపారంలో వాటాను 1500 కోట్ల డాలర్లతో కొనుగోలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ ఆరామ్‌కో ప్రకటించింది. రిలయన్స్‌కు చెందిన ఆయిల్-టు-కెమికల్ (ఓ2సీ) వ్యాపారంలో 20 శాతం వాటాను ఆరామ్‌కోకు విక్రయించాలని భావిస్తున్నట్లు గతేడాది ఆగస్టులో ముకేశ్ అంబానీ ప్రకటించారు.
అయితే 'రిలయన్స్ ఒప్పందంపై మాట్లాడాలంటే.. ప్రస్తుతానికి సాధాసాధ్యాలు పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్పగలను. అది ఒక పెద్ద ఒప్పందం. కాబట్టి మేం సమీక్షించుకోవడానికి సమయం తీసుకుంటాం. సాధ్యాసాధ్యాల నివేదికను బట్టి ఒప్పందంపై నిర్ణయం తీసుకుంటాం' అని మదుపర్లతో జూన్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా సౌదీ ఆరామ్‌కో సీఈఓ ఆమిన్ నాజర్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఒప్పందం ఆలస్యమవుతోందని గత నెలలో జరిగిన ఆర్‌ఐఎల్ వార్షిక సమావేశంలో ముకేశ్ పేర్కొన్నారు. ఆమిన్ కూడా ఈ ఒప్పందంపై ఎటువంటి గడువునూ పేర్కొనలేదు.
ఎవరికి ఏం లాభం
ఈ ఒప్పందం జరిగితే.. ఆరామ్‌కో తన ముడి చమురును రసాయనాలుగా మార్చే సామర్థ్యం పెంచుకున్నట్లు అవుతుంది. ఆర్‌ఐఎల్‌కు సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నుంచి సాంకేతిక నైపుణ్యం లభిస్తుంది. దీని వల్ల చమురు తవ్వకం మరింత సులభమవుతుంది.
ఇదీ చూడండి: ప్రపంచ టాప్-100 కంపెనీల్లో రిలయన్స్