భారత్లో కరోనా టీకా విడుదలైన తర్వాత రోజుకు పది లక్షల డోసులను సరఫరా చేసేందుకు 'అపోలో హాస్పిటల్స్' సన్నాహాలు చేస్తోంది. అపోలో అధీనంలోని ఆస్పత్రులు, క్లినిక్లు, హెల్స్ సెంటర్లు, 24/7 ఫార్మసీలలో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
రెండు నుంచి నాలుగు నెలల్లోగా కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అపోలో పేర్కొంది.
వ్యాక్సినేషన్ విషయమై అపోలో ఫార్మసీ ఓ సర్వే నిర్వహిస్తోంది. 'టీకా తీసుకుంటారా?, ఎప్పటిలోగా తీసుకుంటారు?' అనే ప్రశ్నలకు వినియోగదారుల నుంచి సమాధానాలు సేకరిస్తోంది. వ్యాక్సిన్ పొందాలనుకుంటే పేర్లు నమోదు చేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వీరికి సమాచారం అందిస్తామని పేర్కొంది.