దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి కాలుదువ్వుతున్న చైనా మరో తరహా యుద్ధానికి సిద్ధమవుతోంది. బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి సొమ్ము కాజేసే 'సైబర్ యుద్ధం' చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దేశంలో సైబర్ భద్రత వ్యవహారాలు చూసే ఉన్నత స్థాయి సంస్థ అయిన ఈసీఆర్‌టీ-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం- ఇండియా) దీనిపై హెచ్చరికలు జారీ చేసింది కూడా. కరోనా నేపథ్యంలో సాయం చేస్తామంటూ ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంఘాల పేరుతో తప్పుడు ఈ-మెయిల్స్ వస్తాయని, వాటిని తెరిచి చూస్తే నష్టం జరుగుతుందని పేర్కొంది. సైబర్ రంగంలో ఈ తరహా మోసాలను 'ఫిషింగ్'గా వ్యవహరిస్తుంటారు. ఈ సైబర్ నేరాల తీరుతెన్నులు, నివారణ చర్యలపై 'ఈటీవీ భారత్' పలువురు నిపుణులను సంప్రదించింది.
ఆ దేశాల నుంచి సైబర్ దాడుల ముప్పు..
"ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియాల నుంచి సైబర్ దాడులు జరిగే సూచనలు కనిపిస్తున్నయని జాతీయ సైబర్ భద్రత విభాగం మాజీ అధిపతి గుల్షన్ రాయ్ తెలిపారు. వ్యక్తిగతంగాగానీ, సామూహికంగాగానీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు.
'ఆర్థికం, గూఢచర్యం, సైన్యపరమైన కారణాలతో ఈ దాడులకు దిగుతారు. ఈ కారణాలు ఎలా ఉన్నప్పటికీ భారతీయుల్లో గందరగోళం, ఆందోళన కలిగించడం వారి తక్షణ ఉద్దేశం. కీలకమైన సమాచారాన్ని అపహరించడం వారి దీర్ఘకాలిక వ్యూహం' అని చెప్పారు.
'భారతీయులకు సంబంధించిన ఈ-మెయిళ్లు, ఇతర సమాచారాన్ని ఏ దేశం వారు ఎక్కువగా చూస్తున్నారు, ఏయే అంశాలను పరిశీలిస్తున్నారు అన్న అంశాల ఆధారంగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందా లేదా అని పరిశీలిస్తాం.' అని సైబర్ దాడులు జరుగుతాయని ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ఈ ట్రాఫిక్, ట్రెండ్‌ను గమనిస్తే చాలు విషయం అర్థమయిపోతుంది. తాజా పరిస్థితిని విశ్లేషిస్తే అతి తక్కువ సమయంలోనే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయని గుల్షన్ రాయ్ వెల్లడించారు.
చైనా చేస్తున్న ఏర్పాట్లేమిటి?
ప్రైవేటు హ్యాకర్లతో పాటు, చైనా ప్రభుత్వమే ఇలాంటి సైబర్ దాడులను ప్రోత్సహిస్తోంది. సైబర్ దాడులు చేయడం, తమ వ్యవస్థలపై దాడులు చేస్తే ఎదుర్కోవడంపై విస్తృతమైన ఏర్పాట్లు ఉన్నాయి. చైనా సైన్యం 2016లో ప్రత్యేకంగా వ్యూహాత్మక మద్దతు దళం (స్ట్రేటజిక్ సపోర్ట్ ఫోర్స్-ఎస్‌ఎస్‌ఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ యుద్ధంతో పాటు, మానసిక యుద్ధానికి వ్యూహాలను రూపొందించడాన్ని ఈ విభాగం చూసుకుంటుంది.
హనీపాట్స్తో ఆటకట్టు..
సైబర్ దాడులు చేసే హ్యాకర్ల చర్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవడానికి భారత నిపుణులు ప్రతి వ్యూహాలను సిద్ధం చేశారు. హ్యాకర్లను ఊరించే విధంగా ఈ-మెయిళ్లు, వెబ్‌సైట్ల వంటివి రూపొందించి వారిని ఆకర్షిస్తారు. వారు దాంట్లో లాగిన్ కాగానే వారి వివరాలు సేకరించి ఆటకట్టిస్తారు. ఇలాంటి ఊరించే సమాచారాన్నే 'హనీ పాట్స్' (తేనె కుండలు)గా వ్యవహరిస్తుంటారు.
హనీ పాట్స్‌తో పాటు, ఇతర పద్ధతుల ద్వారా కూడా తొలిదశలోనే వారిని అడ్డుకునే ఏర్పాట్లు చేసినట్టు సైబర్ భద్రత నిపుణుడు రోహిత్ శ్రీవాత్సవ తెలిపారు. నకిలీ పేర్లతో వచ్చే స్పామ్‌లను గుర్తించడానికి 'హనీ నెట్'తో పాటు 'శివ' పేరుతో హనీ పాట్‌ను రూపొందించినట్టు వోలన్ సైబర్ సెక్యూరిటీ అధినేత, సైబర్ నిఘా నిపుణుడు ముస్లిం కోసర్ తెలిపారు. సైబర్ భద్రత నిబంధనలను ఉల్లంఘించి చాలా సంస్థలు అక్రమంగా ఈ-మెయిల్ చిరునామాలను సంపాదిస్తున్నాయని, దాంతో సైబర్ దాడులకు అవకాశం ఏర్పడిందని వివరించారు.
ఇదీ చూడండి:చైనాను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం పావులు!