Amazon Web Services Outage: క్లౌడ్ సర్వీస్ నెట్వర్క్ అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలు మంగళవారం ఐదు గంటలపాటు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఈ సేవలను వినియోగించే ప్రముఖ వెబ్సైట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అమెరికాలోని అనేక ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, కంపెనీలు సహా హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, టిండర్, ఐఎండీబీ ఈ సేవలనే ఉపయోగిస్తున్నాయి. దీంతో వీటి యూజర్లు కొన్ని గంటలపాటు యాప్స్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. గంటల వ్యవధిలోనే 24వేల ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
అయితే మంగళవారం సాయంత్రానికి సమస్యను పరిష్కరించినట్లు అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్), నెట్వర్క్ డివైస్‌లో సమస్యలు తలెత్తడం వల్లే సేవలు నిలిచిపోయినట్లు చెప్పింది. దాదాపు అన్ని సేవలు పునరుద్ధరించామని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో మాత్రమే ఈ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల తూర్పు అమెరికా ప్రధానంగా ప్రభావితమైనట్లు సంస్థ చెప్పింది. అమెజాన్ వేర్‌హౌస్, డెలివరీ ఆపరేషన్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సేవలకు అంతరాయం ఏర్పడగా.. ఐదు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
aws outage:
ఈ సేవల అంతరాయం వల్ల అమెరికా డెల్టా ఎయిర్‌లైన్స్ కస్టమర్లు టికెట్ బుక్ చేసుకునేందుకు, ట్రిప్‌లో మార్పులు చేసుకునేందుకు ఇబ్బందిపడ్డారు. ఇతర విమాన సంస్థలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి.
అయితే అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలు నిలిచిపోవడం వల్ల అమెరికా ప్రభుత్వ సంస్థలు ప్రభావితమయ్యాయా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.
ఇదీ చదవండి: అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ భారీగా పెంపు- సోమవారం నుంచే...