ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. డెలివరీ నెట్వర్క్లో మహీంద్రా విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీనితో అమెజాన్ ఇండియా దాదాపు వంద మహీంద్రా ట్రియో జోర్ (త్రిచక్ర వాహనం) విద్యుత్ వాహనాలను తమ డెలివరీ నెట్వర్క్లో వినియోగించనుంది. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్, లఖ్నవూ నగరాల్లో వీటిని నడపనుంది.
2025 నాటికి దేశవ్యాప్తంగా తమ డెలివరీ నెట్వర్క్లో విద్యుత్ వాహనాల సామర్థ్యాన్ని 10 వేలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్ష్యం లక్ష వాహనాలుగా పేర్కొంది. ఈ లక్ష్యంలో భాగంగానే మహీంద్రాతో ఒప్పదం చేసుకున్నట్లు తెలిపింది.
ఈ-మొబిలిటీ, పర్యావరణ సంరక్షణ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ ఒప్పందం కీలక అడుగని అమెజాన్ ఇండియా పేర్కొంది.
అమెజాన్ ప్రత్యర్థి సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా 2030 నాటికి తమ డెలివరీ నెట్వర్క్లో పూర్తిగా విద్యుత్ వాహనాలను వినియోగించాలని భావిస్తున్నట్లు గతంలో తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్, దిల్లీ, జైపుర్, భువనేశ్వర్, పుణె, ముంబయి, బెంగళూరు, కోల్కతా, లఖ్నవూలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తోంది.
ఇదీ చదవండి:2020లో 12.5% తగ్గిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు