విద్యుత్ వాహనాలు (ఈవీ) ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల చాలా మంది విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయటం గురించి ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాతావరణ కాలుష్యం విషయంలో ఆందోళనలు కూడా ఈవీల వాడకం వైపు వినియోగదారులను మళ్లిస్తున్నాయి.
వాహనాల్లో పెట్రోల్, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధనాలకు ప్రస్తుతం విద్యుత్‌ను ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. విద్యుత్ వల్ల గ్రీన్ హౌస్ వాయువులు వెలువడవు. పర్యావరణానికి హాని కలగదు. అందుకే ప్రభుత్వాలు వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తి పర్యావరణ హితంగా మారితే ఎలాంటి కాలుష్యం కలగదు.
పెట్రోల్, డీజిల్‌కు విద్యుత్‌తో పాటు పలు ప్రత్యామ్నాయులు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని పూర్తి సురక్షితం కాగా… మరికొన్ని పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే తక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయి. హైడ్రోజన్‌ను ఉపయోగించటం వల్ల ఎలాంటి గ్రీన్ హౌజ్ వాయువులు వెలువడవు. అదే విధంగా బయోడీజిల్, ఇథనాల్ ద్వారా.. కాలుష్య వాయువులను చాలా వరకు తగ్గించవచ్చు. అయితే వీటి ఉత్పత్తి, నిల్వ తదితర అంశాల్లో సవాళ్లు ఉన్నాయి.
బయో డీజిల్
బయోడీజిల్ పునరుత్పాదక ఇంధనం. జంతువుల కొవ్వు, రెస్టారెంట్లలో ఉపయోగించిన నూనె ద్వారా దీనిని తయారు చేయవచ్చు. ఇది డీజిల్‌ను పోలి ఉంటుంది కాబట్టి దీనిని డీజిల్‌తో నడిచే వాహనాల్లో ఉపయోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. బయోడీజిల్ సురక్షితమైనదేనంటున్నారు. వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. బయో డీజిల్ మండేందుకు ఎక్కువ ఉష్ణోగ్రత కావాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన బయోడీజిల్‌గా పరిగణించే బీ100 ద్వారా వాతావరణంలోకి వెలువడే కార్బన్ డై యాక్సైడ్ 75 శాతం తగ్గిపోతుంది.
ఇథనాల్
ఇది ఆల్కాహాల్‌తో పునరుత్పత్తి చేయగలిగే వీలున్న ఇంధనం. తాగే పానీయాలలో ఉండే అల్కహాల్ నుంచి ఈథనాల్ను తయారు చేయవచ్చు. ఇథనాల్‌ను పలు రకాలుగా పెట్రోల్‌తో కలిపి వాడుకోవచ్చు. దీనవల్ల ఇంధన ధరలు తగ్గుతాయి. ఇథనాల్‌ను ఉపయోగించటం వల్ల.. గ్రీన్ హౌజ్ వాయువులను 52 నుంచి 86 శాతం వరకు తగ్గించవచ్చు. ఇథనాల్‌ను సంప్రదాయ ఇంధనాల మాదిరిగానే నిల్వ చేయవచ్చు. అయితే పెట్రోల్‌తో పోల్చితే ఇథనాల్‌కు తక్కువ శక్తి ఉంది.
హైడ్రోజన్
హైడ్రోజన్ వల్ల ఎలాంటి గ్రీన్ హౌజ్ వాయువులు వెలువడవు. హైడ్రోజన్ ఇంధన సెల్లో శక్తి ఉత్పత్తి అవటం వల్ల కేవలం వేడి గాలి, ఆవిరి మాత్రమే వెలువడుతాయి. అయితే హైడ్రోజన్ ఇంధనాన్ని నీరు, హైడ్రో కార్బన్స్ లేదా ఇతర సహాజ పదార్థాల నుంచి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో సహాయ వాయువు లేదా ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తి కోసం విద్యుదుత్పత్తి కేంద్రాలపై ఆధారపడాలి. అంతేకాకుండా హైడ్రోజన్ నిల్వకు తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ పీడనం లేదా రసాయన ప్రక్రియ అవసరమవుతాయి. దీనివల్ల హైడ్రోజన్‌ను నిల్వ చేయటంలో సవాళ్లు ఉంటాయి.
సహజ వాయువు
సహజ వాయువును ప్రపంచవ్యాప్తంగా పలు విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. బయో మీథేన్‌ను పశువుల వ్యర్థాలు, చెత్త నుంచి ఉత్పత్తి చేయవచ్చు. బయోడిగ్రేడబుల్ పదార్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేస్తే సహాజ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఇది సంప్రదాయ ఇంధన వనరులను పోలీ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతమున్న మౌలిక సదుపాయల ద్వారా నిల్వ చేసుకోవచ్చు.
ప్రోపేన్
ఇది గ్రీన్ హౌస్ వాయువులు వెలువరించటాన్ని 10 శాతం మాత్రమే తగ్గిస్తుంది. ఈ ఇంధనం ఎక్కువ శక్తిని ఇస్తుంది. అయితే ప్రోపేన్తో నడిచే వాహనాల ధర ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ కంటే ప్రోపేన్కు చౌకగా లభిస్తుంది.
ఇదీ చదవండి: 'అన్ని రకాల పనులకు అనువైన ట్రాక్టర్ల తయారీ'