సాధారణంగా ఏవైనా అత్యవసర ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే మనమంతా వెంటనే సంప్రదించే మార్గం వ్యక్తిగత రుణం(పర్సనల్ లోన్). ముఖ్యంగా కొవిడ్ సంక్షోభం సమయంలో అనేక మంది రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వ్యక్తిగత రుణంపై ఉన్న అపోహల కారణంగా కొంతమంది అర్హత ఉన్నా.. ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. మరి ఆ అపోహలేంటి? అందులో నిజమెంతో చూద్దామా!
అధిక వడ్డీరేటు
మిగిలిన రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణంలో వడ్డీరేటు ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో ఇది వాస్తవం కాదు. నిజానికి వడ్డీరేటు వ్యక్తిని బట్టి, బ్యాంకును బట్టి కూడా మారుతుంటుంది. రుణం తిరిగి చెల్లించే స్తోమత.. సిబిల్ స్కోర్ ఆధారంగా కూడా వడ్డీ రేటును నిర్ణయిస్తారు. తక్కువ వడ్డీరేటుతో పర్సనల్ లోన్ అందిస్తున్న బ్యాంకులు చాలానే ఉన్నాయి.
ఉద్యోగులకు మాత్రమే..
కేవలం వేతన జీవులకు మాత్రమే పర్సనల్ లోన్ ఇస్తారన్న అపోహ సమాజంలో బలంగా పాతుకుపోయింది. కానీ, ఇందులో కూడా నిజం లేదు. స్వయం ఉపాధి, బిజినెస్ చేస్తున్నవారు కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీని బట్టి బ్యాంకులు లోన్ ఇవ్వాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తాయి.
ముందస్తు చెల్లింపు సదుపాయం ఉండదు..
ఇది కూడా అపోహే. ఇతర రుణాల వలే ఇందులో కూడా ముందస్తు చెల్లింపు సదుపాయం ఉంటుంది. రుణగ్రహీతలు తమ వద్ద డబ్బు సర్దుబాటు అయితే.. కాలపరిమితి కంటే ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. అయితే, ఛార్జీలు వర్తిస్తాయి.
బ్యాంకులు మాత్రమే పర్సనల్ లోన్ ఇస్తాయి..
సంప్రదాయ బ్యాంకులతో పాటు అనేక బ్యాంకింగేతర సంస్థలు, డిజిటల్ రుణదాతలు కూడా వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నారు.
రుణ మంజూరుకు చాలా సమయం పడుతుంది..
మిగిలిన వాటితో పోలిస్తే పర్సనల్ లోన్ అన్‌సెక్యూర్డ్ అనే చెప్పాలి. ఎలాంటి తనఖా లేకుండానే రుణం మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో రుణం మంజూరు కావడానికి చాలా సమయం పడుతుందని భావిస్తుంటారు. కానీ, ఇందులోనూ నిజం లేదు. సాధారణంగా 2-7 పనిదినాల్లో బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. పెద్దగా పత్రాలేమీ అవసరం లేకుండా కూడా రుణం అందిస్తున్న బ్యాంకులు ఉన్నాయి.
అయితే, పర్సనల్ లోన్ అత్యవసరమైతే తప్ప తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. అదీ అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను విచారించి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే రుణం తీసుకోవాలి. వడ్డీరేట్లను సరిపోల్చుకోవాలి. ఎలాంటి పత్రాలు అడుగుతున్నారు.. బ్యాంకు విశ్వసనీయత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఎఫ్డీ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..