నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండో సెషన్లోనూ స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గత సెషన్లో 395 పాయింట్లు తగ్గిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ నేడు 793 పాయింట్లు కోల్పోయింది. 38 వేల 721 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ... 253 పాయింట్లు తగ్గి 11 వేల 559 వద్ద ముగిసింది.
2019లో దేశీయ మార్కెట్లు ఒకే రోజున ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
ఇవీ కారణాలు...
అధిక ఆదాయం కలిగిన వారిపై సర్ఛార్జిని పెంచుతూ బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది కేంద్రం. విదేశీ మదుపర్లు, సంపన్నులపై పన్ను భారం పెంచే ఈ నిర్ణయం మదుపర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది.
అమెరికాలో ఉద్యోగ గణాంకాలు మెరుగైన నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి.
ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫినాన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా...
ఉదయం 39వేల 476 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్... ఏ దశలోనూ కోలుకోలేదు. ఓ సమయంలో 907 పాయింట్లు పతనమై 38 వేల 605 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. చివరకు 38 వేల 721 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లో...
బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, మారుతి, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్ దాదాపు 9 శాతం నష్టపోయాయి.
ఎస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ఎమ్, ఎమ్ అండ్ ఎమ్, ఇన్ఫోసిస్ 5 శాతం వరకు లాభపడ్డాయి.