అసలే వర్షాకాలం... దోమలు విజృంభించి వ్యాధులు ప్రబలే సమయం. ఆసుపత్రులకు వెళితే... జేబుకు చిల్లుపడే అవకాశం. ఇప్పుడు కథ మారింది. దోమకాటు వల్ల సంక్రమించే ఏడు రకాల వ్యాధులకు పరిహారం అందించేందుకు ఓ సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీ వచ్చింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లు సంయుక్తంగా ఈ వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి.
రూ.99 లకే బీమా
దేశంలో బీమా విస్తృతిని పెంచడంలో భాగంగా 'మస్కిటో డిసీస్ ప్రొటెక్షన్ పాలసీ' (ఎండీపీపీ)ని తీసుకొచ్చినట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకును ఉపయోగిస్తున్నవారు ఏడాదికి రూ.99 ప్రీమియం చెల్లించి ఈ పాలసీ తీసుకోవచ్చని తెలిపింది.
వ్యాధుల జాబితా
దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువ్యాపు వ్యాధి, జికా వైరస్ లాంటి వ్యాధులు ఈ పాలసీ కిందకు వస్తాయి. రోగం బారినపడి 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంటే, ఈ పాలసీలో పేర్కొన్న మొత్తం విలువ... గరిష్ఠంగా రూ.10,000 వరకూ పరిహారంగా అందుతుంది.
అల్ప ఆదాయ వర్గాలవారికి..
"దాదాపు 40 లక్షల మందికి పైగా మా ఖాతాదారులకు ఈ పాలసీని అందించబోతున్నాం. రోజువారీ ఆదాయం పొందేవారు.. ఒక రోజు ఆసుపత్రిలో ఉన్నా వారికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఎంతో కొంత తీర్చడమే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధాన లక్ష్యం."
-అనుబత్రా విశ్వాస్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ
ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా ఈ బీమాను సులువుగా తీసుకునే వీలుందని అనుబత్రా విశ్వాస్ పేర్కొన్నారు. వాలెట్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఈ పాలసీని అందిస్తున్నామని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ త్యాగి వివరించారు.
ఇదీ చూడండి: రూపాయి బలపడింది- బంగారం దిగొచ్చింది.. ఎంతంటే...