జులై- సెప్టెంబరు త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ అత్యధిక త్రైమాసిక ఏకీకృత ఆదాయాన్ని నమోదుచేయగా, నష్టాలు తగ్గాయి. సంస్థ ఏకీకృత ఆదాయం 22 శాతం పెరిగి రూ.25,785 కోట్లుగా నమోదుకాగా.. నికర నష్టం రూ.763 కోట్లకు పరిమితమైంది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.23,045 కోట్లు. ఏజీఆర్ బకాయిల కోసం రూ.28,450 కోట్లను కేటాయించడం వల్లే అప్పట్లో భారీ మొత్తంలో నష్టాన్ని చూపించింది. లాభదాయకతను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విత్తల్ తెలిపారు.
భారత్‌లో ఎయిర్‌టెల్ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.18,747 కోట్లు నమోదైంది. మొబైల్ ఆదాయంలో 26 శాతం వృద్ధి ఉండగా.. ఆర్పు రూ.162గా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్పు రూ.128 కాగా.. ఈ ఏడాది ఏప్రిల్- జూన్‌లో రూ.157గా నమోదైంది.
- ఏడాదిక్రితంతో పోలిస్తే 4జీ డేటా వినియోగదార్ల సంఖ్య 48.1 శాతం పెరిగి 15.27 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది.
- నెలకు ఒక వినియోగదారు సగటు డేటా వినియోగం 16 జీబీ కాగా.. వాయిస్ కాల్స్ వినియోగం నెలకు 1,005 నిమిషాలు అని తెలిపింది.
- ఘనా దేశ విపణి నుంచి వైదొలిగినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.