భారతీ ఎయిర్‌టెల్ తాము సేవలు అందిస్తున్న 10 టెలికాం సర్కిళ్లలో భవనాల లోపలా మొబైల్ మాటలు స్పష్టంగా వినపడేలా, డేటా వేగం బాగుండేలా కవరేజీని విస్తృతం చేయనుంది. ఇందు కోసం 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 4జీ సాంకేతికతను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాండ్‌ను 2జీ సేవల కోసం కంపెనీ వినియోగించేది. ఆంధ్రప్రదేశ్, దిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఈ బ్యాండ్‌ను పునః వ్యవస్థీకరించి 4జీ సేవలను విస్తరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే కంపెనీ దేశవ్యాప్తంగా 3జీ మౌలిక వసతులను 4జీకి అనుగుణంగా మార్పిడి చేసినట్లు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ మార్పిళ్ల కారణంగా భవనాలు, అపార్ట్‌మెంట్ల లోపల కూడా మొబైల్ సిగ్నళ్లు బలంగా రావడానికి వీలు కలుగుతుంది. ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్ ఇంకా స్పందించలేదు.